జనగణన వల్ల ప్రభుత్వ పథకాలు నిలిచిపోవు: మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:13 PM
జనగణన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జనగణనలో భాగంగా దిల్ కుశ గెస్ట్ హౌస్‌లో అధికారుల సమక్షంలో మంత్రి కిషన్ రెడ్డి స్వీయ నమోదు చేసుకున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26: జనగణన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకోవాలని తెలంగాణ ప్రజలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జనగణనలో భాగంగా దిల్ కుశ గెస్ట్ హౌస్‌లో అధికారుల సమక్షంలో మంత్రి కిషన్ రెడ్డి స్వీయ నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అధికారిక జనాభా గణన ఇది. రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందించే ప్రణాళికలకు ఇది పునాది కానుంది. ప్రధానమంత్రి మోదీ అన్నట్లు "మదర్ ఆఫ్ డెమోక్రసీ"లో భాగస్వామ్యం కావడం అంటే, దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రక్రియలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించడమే. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు మే 10వ తేదీ వరకు అవకాశం కల్పించడం గొప్ప పరిణామం.
ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా, సమయాన్ని ఆదా చేస్తుంది. చాలామంది తమ వివరాలు ఇస్తే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయేమో అని ఆందోళన చెందుతుంటారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మీరు ఇచ్చే వివరాల వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు. జనాభా లెక్కల్లో వివరాలు ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాల దూరం కావు. ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే. జనాభా లెక్కలు కేవలం తలల లెక్క కాదు.. అవి దేశ భవిష్యత్తుకు దిక్సూచీ. పథకాల రూపకల్పనకు ఏ ప్రాంతంలో ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయి? సామాజిక, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే అంశాల ఆధారంగానే కొత్త పథకాలు రూపొందిస్తారు.
వాటికీ ఈ గణన ఉపయోగపడుతుంది. జనాభా నిష్పత్తిని బట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కేటాయింపు చేపడతాయి. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తన సత్తా, అవసరాలను చాటుకోవడానికి ఈ ఖచ్చితమైన గణాంకాలు అవసరం. దీనిని ఒక 'పండుగలా' భావించి ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా, తమ ప్రాంత అభివృద్ధికి తామే పరోక్షంగా సహకరించినట్లు అవుతుంది. అధికారులు అడిగే వివరాలను నిర్భయంగా జవాబు చెప్పండి. తద్వారా రాబోయే పదేళ్ల అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రజలకు’ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్ర ప్రజలంతా జనగణనలో పాల్గొనాలి: తెలంగాణ గవర్నర్ పిలుపు
కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి
For More TG News And Telugu News