Share News

కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి

ABN , Publish Date - Apr 26 , 2026 | 02:54 PM

సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు, రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన సాగుతుందంటూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలంటూ కవితను ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి
MP Mallu Ravi

హైదరాబాద్, ఏప్రిల్ 26: సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు, రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన సాగుతుందంటూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలంటూ కవితను ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ప్రజల్లోకి వెళ్లాలని ఆమెకు సూచించారు. శనివారం మేడ్చల్‌లో కొత్త పార్టీ పేరు ప్రకటించిన సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో ఎంపీ మల్లు రవి స్పందించారు.


విమర్శించే హక్కు కవితకు లేదు..

తెలంగాణలో రామ రాజ్యం నడుస్తుంటే కవితకు ఏ రకంగా హిట్లర్ రాజ్యం కనిపిస్తుందంటూ మల్లు రవి సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రాజ్యం నడుస్తుందో.. కవిత సభకు హాజరైన ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. కొత్త పార్టీ పెట్టుకునే హక్కు కవితకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రి, బిడ్డలు ఏమైనా మాట్లాడుకోవచ్చునని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కవితకు లేదన్నారు.


అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చింది..

బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీల్లో కవిత 10 ఏళ్లు కీలక పదవులు అనుభవించిందని కాంగ్రెస్ ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టయి జైలుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ సరిగ్గా స్పందించలేదన్నారు. అందుకే ఆ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చిందని కుండబద్దలు కొట్టారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు కల్పించలేదని ఆయన కవితను సూటిగా ప్రశ్నించారు. తాము ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు.


కేసీఆర్‌ను కవిత ఎందుకు ప్రశ్నించ లేదు..

ప్రజలకు మీరు ముక్క బియ్యం ఇచ్చారు.. కానీ తాము సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబినెట్‌లో మహిళలకు ఎందుకు చోటు కల్పించలేదని మీ తండ్రి కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేదంటూ కవితను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను 50 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారని మల్లు రవి మండిపడ్డారు.


వారిద్దరికీ నోటీసులు ఇస్తాం..

రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా హరిప్రసాద్, కృష్ణ కిశోర్ పని చేశారంటూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్ ఝాన్సీ రెడ్డి ఫిర్యాదు చేశారని మల్లు రవి తెలిపారు. ఈ నేపథ్యంలో హరి ప్రసాద్, కృష్ణ కిశోర్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. తాను అమెరికాలో ఉన్నానని కృష్ణ కిషోర్ చెప్పారని.. తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హరి ప్రసాద్ లేఖ రాశారని ఎంపీ మల్లు రవి చెప్పారు.10 రోజుల్లో వివరణ ఇవ్వాలని వారిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.


పార్టీకి నష్టం జరుగుతుంది..

బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా మీడియాలో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు.


ప్రభుత్వపరంగా ఇబ్బంది కలిగితే..

ఎవరికైనా ఇబ్బంది కలిగితే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కేడర్‌కు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇబ్బంది ఎదురైతే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు అన్నీ పరిష్కరించామని ఆయన గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం జరగనీయమన్నారు. ఆర్టీసీ సమ్మెలో కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం దురదృష్టకరమని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఎంపీ మల్లు రవి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. మంత్రి నారాయణ ధ్వజం

ట్రంప్ కార్యక్రమం సందర్భంగా కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్..

For More TG News And Telugu News

Updated Date - Apr 26 , 2026 | 03:29 PM