వైట్‌హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు.. నిందితుడి టార్గెట్ ట్రంప్!
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:27 PM
వైట్‌హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా నిందితుడు దాడికి యత్నించి ఉండవచ్చని యూఎస్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌లో శనివారం జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులకు తెగబడ్డ నిందితుడు కోల్ టొమాస్ అలెన్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని యూఎస్ అటార్నీ జనరల్ టాడ్ ఆదివారం తెలిపారు. ట్రంప్ సహా ఆయన యంత్రాంగంలోని కీలక వ్యక్తులను నిందితుడు టార్గెట్ చేసినట్టు అనిపిస్తోందని అన్నారు. ‘కేసును పరిశీలిస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక వ్యక్తులే లక్ష్యంగా నిందితుడు రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. ట్రంప్‌ను కూడా టార్గెట్ చేసి ఉండవచ్చు’ అని ఆయన అన్నారు. ఘటనకు ముందు అతడు ఏయే ప్రాంతాల్లో సంచరించాడో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన ఈ డిన్నర్ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. హోటల్‌లోని బాల్‌రూమ్‌లో కార్యక్రమం జరుగుతుండగా హాల్ బయట నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. సెక్యూరిటీని దాటుకుని వెళ్లే క్రమంలో కాల్పులు జరిపాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తూటాలు పేలిన శబ్దం వినగానే బాల్‌రూమ్‌లోని భద్రతా సిబ్బంది ట్రంప్ దంపతులను, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.