అక్రమాలకు పాల్పడ్డారో రిజిస్ట్రేషన్ రద్దే!
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:02 AM
రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
ఐవీఎఫ్ కేంద్రాలకు సర్కారు హెచ్చరిక
బాధ్యులైన వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు
సరగసి ఏఆర్‌టీ చట్టాల అమలుపై నిపుణుల కమిటీ
ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి దామోదర సమీక్ష
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే ఐవీఎఫ్ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేటు ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమాల్లో భాగస్వాములైన వైద్యుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యశాఖ అధికారులు నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండాల అక్రమ సేకరణ కేసుకు సంబంధించిన వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై సమగ్ర విచారణ జరిపి, దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వైద్యులపై చర్యల విషయంలో రాష్ట్ర వైద్య మండలి, జాతీయ వైద్య మండలి అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.
సరగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) చట్టాల అమలును మరింత పటిష్ఠం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ చట్టాల అమలులో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కేంద్ర చట్టాల పరిధిలోనే రాష్ట్ర స్థాయిలో అదనపు నియంత్రణ చర్యలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు ఐవీఎఫ్ కేంద్రాల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఐవీఎఫ్ చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ తయారీ నుంచి అమ్మకాల వరకూ ప్రత్యేకంగా నిఘా పెట్టాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News