గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 నూతన పాలసీలు
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:09 AM
రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు, భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక రంగాన్ని విస్తరించే దిశగా భారీ కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆవిష్కరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా భారీ కసరత్తు
తయారీ రంగం నుంచి ఏఐ, ఏరోస్పేస్ వరకు ప్రత్యేక విధానాలు
విదేశీ వర్సిటీల క్యాంపస్‌లకు గ్రీన్ సిగ్నల్
జీసీసీ, డేటా సెంటర్ల ఏర్పాటు
డిజిటల్ కంటెంట్, గేమింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు, భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక రంగాన్ని విస్తరించే దిశగా భారీ కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 నూతన పాలసీలను ఆవిష్కరించనుంది. పరిశ్రమలు, ఐటీ, విద్యా రంగాలను కేంద్రంగా చేసుకుని రూపొందించిన ఈ విధానాలు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ విజన్ -2047 లక్ష్యాలకు అనుగుణంగా ఈ పాలసీలను రూపొందిస్తున్నారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో పారిశ్రామిక రంగాన్ని కీలక చోదకశక్తిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సాంప్రదాయిక పరిశ్రమల నుంచి అత్యాధునిక సాంకేతిక రంగాల వరకు అన్ని విభాగాలకూ ప్రత్యేక ప్రోత్సాహకాలు, పెట్టుబడి అవకాశాలు కల్పించాలని యోచిస్తోంది.
పారిశ్రామిక విధానం 2.0 ఈ కొత్త విధానాల్లో కీలకంగా నిలవనుంది. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, భారీగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న ఈ రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీలను తీసుకురానుంది. మరోవైపు రక్షణ, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల్లో తెలంగాణకు ఉన్న అనుకూలతలను మరింతగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా, నిల్వ, సరఫరా వ్యవస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు లాజిస్టిక్స్ పాలసీని కూడా తీసుకురానుంది.
టెక్నాలజీ రంగంలో మరో విప్లవం
సాఫ్ట్‌వేర్ రంగంలో ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను తదుపరి తరం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఐటీ శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, ఎలకా్ట్రనిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగాల్లో ప్రపంచ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా కొత్త విధానాలను రూపొందిస్తున్నారు. సమగ్ర ఐసీటీ పాలసీ 2.0తో పాటు జీసీసీ, డేటా సెంటర్లకు ప్రత్యేక విధానాలను తీసుకురానున్నారు. ఎలకా్ట్రనిక్స్, సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించేలా మరో పాలసీని రూపొందిస్తున్నారు.
సృజనాత్మక సాంకేతిక రంగాలైన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) అభివృద్ధికి ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నారు. డిజిటల్ కంటెంట్, గేమింగ్, విజువల్ మీడియా రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు యువతకు కొత్త ఉపాధి మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాలతోపాటు ఉన్నత విద్యకూ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంప్‌సలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రత్యేక పాలసీని తీసుకురానుంది. అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్థి అవకాశాలను రాష్ట్ర విద్యార్థులకు స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
కొత్త పాలసీలు ఇవీ..
1. ఇండస్ట్రియల్ పాలసీ 2.0
2. ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ
3. టెక్స్‌టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0
4. ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ
5. లాజిస్టిక్స్ పాలసీ
6. ఐసీటీ పాలసీ 2.0
7. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ
8. డేటా సెంటర్స్ పాలసీ 2.0
9. ఎలకా్ట్రనిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ
10. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) పాలసీ
11. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News