గిగ్ వర్కర్లకు 10 లక్షల బీమా
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:32 AM
ప్రజలకు ప్రతి నిత్యం సేవలందిస్తున్నా.. ఎటువంటి సామాజిక భద్రత లేని గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలవనుంది.
ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి అందజేత
గిగ్ వర్కర్ల చట్టం కింద అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ప్రతి నిత్యం సేవలందిస్తున్నా.. ఎటువంటి సామాజిక భద్రత లేని గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలవనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొచ్చిన సర్కారు.. తాజాగా ఆ చట్టం కింద అందించే ఆర్థిక సాయం, నిబంధనల్ని ఖరారు చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ఎవరైనా గిగ్ వర్కర్ ప్రమాదానికి గురై మరణిస్తే.. అతని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ప్రమాదంలో గాయపడి వికలాంగుడైతే రూ.3.50 లక్షల సాయం చేస్తుంది. ఇక గిగ్ వర్కర్ల కుటుంబాలకు ప్రసూతి ఖర్చుల కింద రూ.30 వేల చొప్పున అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. గిగ్ వర్కర్లు అందిస్తున్న సేవలకు సంబంధించి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ)లో ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇప్పించనుంది.
రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, సరుకు రవాణా సిబ్బంది, ఇంటిసేవలు అందించే ప్లాట్‌ఫామ్ కార్మికులను గిగ్ వర్కర్లుగా పరిగణిస్తున్నారు. 2022 నవంబరు 2న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సందర్భంగా.. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023 డిసెంబరు 23న గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ కార్మికులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఒక సమావేశంలో వారికి ప్రత్యేక సంక్షేమ బోర్డు కోసం చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. పలు సంప్రదింపుల అనంతరం ముసాయిదాను రూపొందించి 2026 మార్చి 30న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టగా.. ‘ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల’ బిల్లు ఆమోదం పొందించింది. ఆపై గవర్నర్ ఆమోదం అనంతరం జూన్ 2న జీవో.ఎం.ఎస్.7 ద్వారా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
రాహుల్ సమక్షంలో..
ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనల్ని శనివారం గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్‌గాంధీ నిర్వహించే ర్యాలీలో ప్రభుత్వం ప్రకటించనుంది. ఉదయం 10.30 గంటలకు శిల్పారామం నుంచి గిగ్ వర్కర్లతో రాహుల్ ర్యాలీగా బయలుదేరి జయభేరి గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌తోపాటు గిగ్ వర్కర్ల సమక్షంలో పథకాన్ని ప్రారంభించనున్నారు. శుక్రవారం రాత్రి ఒంటిగంటకు హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్‌గాంధీ.. రాత్రి నోవాటెల్‌లో బస చేశారు. శనివారం ఉదయం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా నాయకులతో, అమెరికా, యూరోపియన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 3 గంటలకు సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News