ఆ రెండు జిల్లాల్లో కరువు తాండవం!
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:26 AM
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రెండు జిల్లాల్లో మాత్రం కరువు తాండవం చేస్తోంది.
సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 28 మండలాలు,
నల్లగొండలోని 31 మండలాలకు 28 చోట్ల ప్రభావం
సంగారెడ్డి/నల్లగొండ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రెండు జిల్లాల్లో మాత్రం కరువు తాండవం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 28 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. అటు నల్లగొండ జిల్లాలోని మొత్తం 31 మండలాలకుగాను 28 మండలాలు కరువు దెబ్బతో విలవిల్లాడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 365 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వర్షపాతం లోటు, భూగర్భజల మట్టాల ప్రాతిపదికన కరువు మండలాల ఎంపిక జరిగిందని వెల్లడించాయి.
బోసిపోతున్న సింగూరు ప్రాజెక్టు
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీటిని అందించడానికి ఉద్దేశించిన సింగూరు రిజర్వాయర్ బోసిపోతోంది. తొలుత మరమ్మతు పనుల రిజర్వాయర్లోని నీటిని దిగువకు వదిలారు. ఆ సమయంలో వచ్చిన వరద కిందకు వెళ్లిపోయింది. తర్వాత గేట్లు మూసినా ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి.. మంజీరా నదిలో ప్రవాహాలే రాలేదు. 30 టీఎంసీల సామర్థ్యమున్న సింగూరు రిజర్వాయర్లో ప్రస్తుతం 3 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉండటం ఆందోళనకరం. దీనితో సంగారెడ్డి జిల్లాలో నీటికి తీవ్రమైన కటకట తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉమ్మడి నల్లగొండను కమ్మేసిన కరువు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 73 మండలాలకుగాను అనుముల, గుడిపల్లి, గుర్రంపోడు, కొండమల్లేపల్లి, కట్టంగూరు మినహా మిగిలిన 68 మండలాల్లో కరువు పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా పరిధిలో వర్షాధారంగా, బోరుబావులపై ఆధారపడి వేసి మెట్టపంటల్లో 90శాతం వరకు దెబ్బతిన్నాయి. వరితోపాటు పత్తి, కంది, పెసర, మినుము పంటలు కూడా ఎండిపోయాయి. 8.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగయితే.. అందులో 90శాతం మేర దిగుబడులు పడిపోయాయి. చెరువుల్లో ఉన్న కాసిన్ని నీళ్లు అడుగంటుతుండటం, భూగర్భజలాలు పడిపోతుండటంతో.. పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News