ఎస్సీ, ఎస్టీల సీట్ల శాతంలో మార్పు లేనట్టే!
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:49 AM
లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే సీట్లు పెరుగుతాయా, లేదా అన్నదానిపై చర్చ నడుస్తోంది.
2008 పునర్విభజనలో పెరిగిన సీట్ల శాతం
2001 నాటికి వారి జనాభా పెరగడమే కారణం
తర్వాత ఎస్సీ, ఎస్టీల జనాభాలో మార్పు తక్కువ
ఇప్పుడు గంపగుత్తగా 50శాతం పెరగనున్న సీట్లు
మహిళా రిజర్వేషన్లు వస్తే.. నియోజకవర్గాల ఎంపిక డీలిమిటేషన్ కమిటీ చేతిలోనే
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే సీట్లు పెరుగుతాయా, లేదా అన్నదానిపై చర్చ నడుస్తోంది. గంపగుత్తగా పెరిగే 50శాతం సీట్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. వారి జనాభాలో పెరుగుదల కారణంగా 2008 డీలిమిటేషన్ సమయంలో తరహాలో ఇప్పుడు సీట్ల శాతం పెరిగే అవకాశం లేదు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతంలో పెద్దగా మార్పు లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.
2001 నాటికి జనాభా పెరడగంతో..
రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన లోక్సభ, అసెంబ్లీ సీట్లు రిజర్వు చేయాలి. 2008లో జరిగిన డీలిమిటేషన్ను 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించారు. మొత్తం సీట్ల సంఖ్యలో మార్పు లేకున్నా.. ఈ వర్గాల జనాభా పెరగడంతో అదనంగా సీట్లు దక్కాయి. జనరల్ సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు లోక్సభ స్థానాలు ఆరు ఉండగా ఒకటి పెరిగి ఏడు అయ్యాయి. ఎస్టీల రిజర్వుడు స్థానాలు రెండు నుంచి మూడుకు పెరిగాయి. అసెంబ్లీ సీట్లకు వస్తే.. ఎస్సీలకు 39నుంచి 48కి, ఎస్టీలకు 15 నుంచి 19కి పెరిగాయి. ఈ మేరకు జనరల్ స్థానాల్లో కోత పడింది.
జనాభా శాతంలో పెద్దగా మార్పులేకపోవడంతో..
తాజా డీలిమిటేషన్లో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సీట్ల శాతం పెరిగే అవకాశం దాదాపుగా లేదని తేలుతోంది. ఉమ్మడి ఏపీలో 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 16.19శాతంఉండగా.. 2011 లెక్కల ప్రకారం 16.41శాతానికి పెరిగారు. ఎస్టీలు 2001లో 6.59 శాతం నుంచి 2011 నాటికి 7శాతానికి పెరిగారు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక వారి శాతాల్లో తేడా వచ్చింది. ఏపీలో ఎస్సీలు ఎక్కువ, ఎస్టీలు తక్కువ. తెలంగాణలో ఎస్టీలు ఎక్కువ, ఎస్సీలు తక్కువ. ఒక్క తెలంగాణ ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. 2001లో ఎస్సీ జనాభా 15.85 శాతమైతే.. 2011 నాటికి 15.45 శాతానికి తగ్గింది. ఎస్టీల జనాభా 8.87శాతం నుంచి 9.08 శాతానికి స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీలకు 16శాతం (19సీట్లు) ఎస్టీలకు 10.1శాతం (12) సీట్లు ఉన్నాయి.
అంటే తాజా డీలిమిటేషన్లో 2011 జనాభా లెక్కలను ప్రాతిపాదికన తీసుకున్నా ఆయా వర్గాలకు సీట్ల శాతం పెరగదు. అయితే పునర్విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మొత్తం పార్లమెంటు స్థానాలు 17నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119నుంచి 179-182కు పెరుగుతాయి. దాంతో ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలకు కూడా సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీలకు ఇప్పుడున్న మూడు లోక్సభ స్థానాలు నాలుగుకు పెరుగుతాయి. ఎస్టీలకు ఇప్పుడున్న రెండే తర్వాతా కొనసాగుతాయి. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే.. ఇప్పుడున్న 19 స్థానాలు 27-28కు, ఎస్టీ స్థానాలు 12 నుంచి 16-18 వరకు పెరుగుతాయి. రిజర్వుడ్ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల ఎంపికను డీలిమిటేషన్ కమిషన్ ఖరారు చేస్తుంది.
మహిళల రిజర్వుడ్ సీట్ల ఎంపిక ఎలా?
కొత్త డీలిమిటేషన్లో మహిళా రిజర్వేషన్లు అమలైతే.. ఆ రిజర్వుడ్ సీట్ల ఎంపికకు ఏ విధానం అనుసరిస్తారన్నది తేలాల్సి ఉంది. లాటరీ పద్ధతిలోను మహిళల రిజర్వేషన్లు కేవలం రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సమప్రాతినిధ్యంలో మహిళల స్థానాలు ఉండేలా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ సీట్లకు మహిళా రిజర్వేషన్లు ఉండనున్న నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. వాటికి అనుగుణంగా డీలిమిటేషన్ కమిషన్ రిజర్వేషన్లు, సీట్ల ఎంపికను చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News