డీప్‌టెక్ ఆవిష్కరణలకు రాష్ట్రంలో అపార అవకాశాలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:27 AM
డీప్‌టెక్ ఆవిష్కరణలకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. వాటిని ప్రజా జీవితాల్లో మార్పులు తెచ్చే ఉత్పత్తులు, సేవలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు సాంకేతిక ఆవిష్కరణలే కీలకం
పారిశ్రామికవేత్తలు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సులో పాల్గొనాలి: భట్టి
రాష్ట్రాన్ని డీప్‌టెక్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతాం: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): డీప్‌టెక్ ఆవిష్కరణలకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. వాటిని ప్రజా జీవితాల్లో మార్పులు తెచ్చే ఉత్పత్తులు, సేవలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బుధవారం బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్’ సదస్సులో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన సార్థకత లభిస్తుందన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో సాంకేతిక ఆవిష్కరణలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు, పరిశ్రమలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలు, విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. 2034-35 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నామన్నారు. సాఫ్ట్‌వేర్, ఔషధ తయారీ, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ సామర్థ్యాలన్నింటినీ సమన్వయం చేసుకున్నట్లయితే డీప్‌టెక్ రంగంలో రాష్ట్రం ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదిక అవుతుందన్నారు.
ఏ సాంకేతిక ఆవిష్కరణ అయినా సామాన్య ప్రజలకు, రైతులకు అందుబాటు ధరల్లో ఉండేలా ప్రారంభ దశ నుంచే ప్రణాళికను రూపొందించాలని స్పష్టం చేశారు. డీప్‌టెక్ ఆవిష్కరణలు పరిశోధకులు, సంస్థలకే పరిమితం కాకుండా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. రాష్ట్రంలో పరిశోధనలు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఫిక్కీ భారతీయ పారిశ్రామిక రంగం అభివృద్ధికి వందేళ్లుగా విశేష సేవలందిస్తోందని భట్టి ప్రశంసించారు. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, భాగస్వాములు హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్‌టెక్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పరిశ్రమలు, సంస్థల సమష్ఠి భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని.. సర్కారుతో కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రైతుభరోసా పేరిట నకిలీ ఎస్‌ఎంఎస్‌లు!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News