సీఈసీపై ఆగ్రహ జ్వాల
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:14 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కోట్లాది ఓట్ల తొలగింపునకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమారే కారణమని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు
సీఈవో సహా జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు
జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే: మహేశ్‌గౌడ్
బీజేపీకి తొత్తుగా సీఈసీ: డిప్యూటీ సీఎం భట్టి
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ: ఉత్తమ్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష
ఈసీ అవకతవకలపై చర్యలు తీసుకోవాలి
వనపర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కోట్లాది ఓట్ల తొలగింపునకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమారే కారణమని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన ఆందోళనలో భాగంగా ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)తోపాటు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు.. ఈసీఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి సీఈవో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకట్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు.. నిజమని తేలిపోయిందన్నారు. ఓటు హక్కునే కాలరాస్తే ... ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? అని ప్రశ్నించారు. సర్ పేరిట ఓట్లను తొలగించడం దురదృష్టకర పరిణామమన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీకి తొత్తుగా మారారాని విమర్శించారు. సర్ పేరిట ఓట్ల తొలగింపు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడి ఓటుహక్కు పరిరక్షించేలా ఈసీఐ దృష్టిపెట్టాలన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఈసీ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సర్ కసరత్తును కేంద్రం వెంటనే నిలిపివేయాలన్నారు. అనంతరం సీఈవో సుదర్శన్‌రెడ్డిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
కాగా, సీఈవో కార్యాలయం ఎదుట సీపీఐ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పార్టీ కార్యకర్తలు సీఈఓ కార్యాలయం గేట్లు దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో దానికి తగిన మూల్యం చెల్లించుకోనుందని అన్నారు. సీఈసీపై కేసు నమోదుచేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సర్’కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ నిర్వహించే పోరాటానికి తామంతా మద్దతుగా ఉంటామన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని స్పష్టంచేశారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ, వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ములుగులో నిర్వహించిన ఆందోళనలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని, ఓట్ల చోరీకి పాల్పడుతూ వివిధ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుందని విమర్శించారు. భువనగిరి కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో నిర్వహించిన నిరసనలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. సీఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఆయన్ను ప్రజాక్షేత్రంలో శిక్షించాలని సావంత్ డిమాండ్ చేశారు. గద్వాలలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజే్‌షరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి. చిక్కుడు వంశీకృష్ణ, మహబూబ్‌నగర్‌లో విప్ యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News