రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి..!
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:56 AM
రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను గజగజ వణికిస్తోంది. సోమవారం పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి.
సంగారెడ్డి జిల్లా కోహీర్ లో అత్యల్పంగా 11.7 డి గ్రీలు
మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ
హైదరాబాద్ సిటీ, కోహీర్, ఆసిఫాబాద్ నవంబర్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను గజగజ వణికిస్తోంది. సోమవారం పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతలైన పటాన్‌చెరులో 12.4, రాజేంద్రనగర్‌లో 13.0, ఉమ్మడి మెదక్ జిల్లా శివ్వంపేటలో 13.3, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 13.4, తిర్యాణిలో 13.6, కెరమెరి, వాంకిడి మండలాల్లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం, రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ప్రయాణాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు.
ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చలి తీవ్రత కొనసాగుతుండగా, శివారు ప్రాంతాల్లో వీస్తున్న చలి గాలులతో అడుగు బయటపెట్టేందుకు స్థానికులు వణికి పోతున్నారు. తెల్లవారు జామున ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనాల రద్దీ తగ్గింది. ఉదయం 9 గంటల వరకు చలిగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖాలకు మాస్కులు, స్వెట్టర్లు లేకుండా ప్రజలకు బయటకు రావడం లేదు. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుండడంతో మధ్యాహ్నం వేళల్లోనూ చలిగాలుల ప్రభావం కనిపిస్తోంది.
గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది క్యూర్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర ఎక్కువగానే నమోదైనా చలిగాలుల తీవ్రత అధికంగా ఉండనుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున, బయటకు వెళ్లినప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఇదే తరహాలో కొనసాగుతుందని, డిసెంబరు నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్