Share News

పంటలు వేయొద్దు

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:18 AM

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి అవసరమైన కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా, పంటలు, తాగునీరు, విద్యుత్తు వంటి కీలక సమస్యలపై దృష్టి సారించింది.

పంటలు వేయొద్దు
Revanth Reddy

  • ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రంగా ఉంది

  • తాగడానికి నీళ్లు, కొందామన్నా కరెంటు దొరకడం లేదు

  • ఈ స్థితిలో యాసంగి పంటలు వేస్తే దారుణంగా ఉంటుంది

  • కావాల్సినన్ని పనిదినాలు కల్పిస్తాం.. అదనపు రేషన్‌ ఇస్తాం

  • రాష్ట్రంలోని రైతులకు విజ్ఞప్తి చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌

  • మంత్రులతో భేటీ రోజు రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌

  • 1500 మెగావాట్లు కామన్‌ పూల్‌ నుంచి ఇవ్వాలని కేంద్రానికి వినతి

  • 60-40 నిష్పత్తిలో రైతులకు పరిహారం అందిద్దామంటూ ప్రతిపాదన

  • ఖరీఫ్‌ పంటల రక్షణకు సంకల్పం.. గ్రామ, రాష్ట్ర కమిటీల ఏర్పాటు

  • విద్యుత్తును, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన

  • సీఎం రేవంత్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికి అవసరమైన కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా, పంటలు, తాగునీరు, విద్యుత్తు వంటి కీలక సమస్యలపై దృష్టి సారించింది. ఈ గడ్డు కాలం నుంచి ఎలా గట్టెక్కాలన్న దానిపై సీరియ్‌సగా ఆలోచిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి ఓ నిర్ణయానికి వచ్చారు.


ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం నెలకొందని, ఈ దృష్ట్యా రబీ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేయనున్నారు. నిజానికి, ఈనెల 12న ఎల్‌నినో ప్రభావంపై మంత్రులతో సీఎం సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ.. అదే రోజు ఏఐసీసీ ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనికి సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు ఎంపీలు, ఇతర కీలక నేతలంతా తరలి వెళ్లనున్నారు. ఫలితంగా, 12న నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. అయినా, సీఎం రేవంత్‌ త్వరలోనే దానిని నిర్వహించనున్నారు. అదే రోజు ‘పంటలు వేయొద్దు’ అని రైతులకు సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ‘


‘ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో తాగడానికి నీళ్లు దొరకడం లేదు. కొందామన్నా విద్యుత్తు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంటలు వేస్తే.. పరిస్థితులు మరీ దారుణంగా ఉండే ప్రమాదముంది. రబీ సీజన్‌లో పంటలకు నీరు అందకపోవచ్చు. రైతాంగం ఇప్పటికే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఉన్న నీటిని కూడా పంటలకు వినియోగిస్తే తాగునీటికి చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. మీరు పంటలు వేయకుండా ఉంటే.. ఉన్న నీటిని తాగునీటికి వినియోగిస్తాం. కావాల్సినన్ని రోజులు పని దినాలు కల్పిస్తాం. అదనపు రేషన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ... మీరు మాత్రం పంటలు వేయొద్దు’’ అని సీఎం రేవంత్‌ వివరించనున్నారు.


కేంద్ర సహాయం కోసం విజ్ఞప్తి

మంత్రులతో సమావేశాన్ని నిర్వహించే రోజే.. సహాయం కోసం కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో రబీ పంటలను రైతులు సాగు చేయడం లేదని, ఈ దృష్ట్యా అన్ని రకాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు. ముఖ్యంగా.. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్తు సమస్య నెలకొంటున్నందున కామన్‌ పూల్‌ కింద రాష్ట్రానికి 1500 మెగావాట్ల విద్యుత్తును అందించాలని డిమాండ్‌ చేయనున్నారు. రబీ సీజన్‌లో రైతులు పంటలు వేసే అవకాశం లేనందున.. ఆ నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పరిహారం కింద కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించేలా చూద్దామంటూ విజ్ఞప్తి చేయనున్నారు. ఇందుకోసం అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లే ఆలోచన ఉన్నట్లు సమాచారం.


పంటల రక్షణకు గ్రామ కమిటీలు

ప్రస్తుత ఖరీఫ్‌ పంటలను పరిరక్షించడానికి గ్రామ స్థాయిలో కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులతో ఈ కమిటీలను వేస్తారు. ఖరీఫ్‌ పంటలు మరో రెండు నెలల్లో చేతికి రానున్నాయి. ఇప్పుడు నీటి ఆవశ్యకత చాలా ఉంది. అందుకే, ఉన్న నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలన్న దానిపై ఈ కమిటీలు గ్రామాల్లో సూచనలు, సలహాలు ఇస్తాయి. అదే రకంగా రాష్ట్రంలో మంత్రులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ రబీ పంటలను వేయకుండా రైతులకు సూచనలు చేస్తుంది.


తక్షణ చర్యలకు ప్రణాళికలు ఇవ్వండి: సీఎం

ఎల్‌నినో ప్రభావంతో అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణ చర్యలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తాగు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్తు సమస్యల విషయంలో సరైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందేనని స్పష్టం చేశారు.


‘‘ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలి. రాబోయే 8 నెలలు కీలకం. ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలి. రాబోయే రోజుల్లో విద్యుత్తు సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. అవసరమైన విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. కానీ... మార్కెట్‌లో విద్యుత్తు అందుబాటులో లేదు. అందుకే అందుబాటులో ఉన్న విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. విద్యుత్తు ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేయండి. ఎల్‌నినో ప్రభావంపై సినిమా, మీడియా, కళాజాతలతోపాటు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించండి’’ అని సూచించారు. ఖరీఫ్‌ పంట చేతికొచ్చే వరకు నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.


త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం తెలిపారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ‘‘రాష్ట్రంలో దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. కరువు మండలాల ప్రకటనతోపాటు తగినంత ఆర్థిక సాయాన్ని అందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కోరింది’’ అని గుర్తు చేశారు.


వీబీజీ-రామ్‌జీ పథకంలో భాగంగా 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సీఎం సూచించారు. దసరా తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పరిస్థితులను సమీక్షించేందుకు వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

హైస్పీడ్‌ రైళ్ల అలైన్‌మెంట్‌ ఖరారు కాలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:20 AM