Share News

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:39 AM

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ మద్దతిచ్చిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కూటమి విజయం సాధించిందని తెలిసింది.

ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం
TSRTC union elections 2026

  • రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,500 ఓట్ల మెజార్టీ

  • కాంగ్రెస్‌ మద్దతిచ్చిన టీడబ్ల్యూయూకు ఎదురుదెబ్బ

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 26 బస్‌ డిపోల్లో

  • 23 డిపోల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ జయభేరి

  • ముగిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

  • 98 శాతం పోలింగ్‌... 14, 15న పోస్టల్‌ బ్యాలెట్‌

  • తుది ఫలితాలు ఈనెల 17న వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ మద్దతిచ్చిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కూటమి విజయం సాధించిందని తెలిసింది. సుమారు 4,500 ఓట్ల ఆధిక్యంతో ఈయూ కూటమి గెలుపొందినట్లు సమాచారం. దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో 12 సంఘాలు మూడు కూటములుగా ఏర్పడి బరిలో నిలిచాయి.


ప్రధానంగా, టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎంయూ) ఒక కూటమిగా బరిలో నిలిస్తే.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ), స్టాఫ్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూయూ) మరో కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టీడబ్ల్యూయూ కూటమికి మద్దతు తెలిపింది. జిల్లాల్లో టీడబ్ల్యూయూ కూటమి పైచేయి సాధిస్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈయూ జయభేరి మోగించింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 115 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 98 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.


ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేశారు. వాటిలో ఒకటి రాష్ట్ర గుర్తింపు సంఘానికి, మరో ఓటు స్థానిక గుర్తింపు సంఘానికి వేశారు. ఈనెల 14, 15 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో 980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం, ఈనెల 17న తుది ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇక, గ్రేటర్‌ జోన్‌ హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ రీజియన్‌లో 26 బస్‌ డిపోలు ఉండగా 23 స్థానాల్లో ఈయూ, మూడు చోట్ల టీడబ్లూయూ ముందంజలో నిలిచాయి. ఎన్నికల్లో గెలుపొందిన నాయకులు డిపోల వద్ద సంబురాలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి.


నాగర్‌ కర్నూలు డిపోలో టీడబ్ల్యూయూ, గద్వాల డిపోలో ఈయూ, షాద్‌నగర్‌ డిపోలో మజ్దూర్‌ యూనియన్‌ విజయం సాధించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీడబ్ల్యూయూ ఆధిక్యంలో ఉంది. నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల్లో ఐదు డిపోలు ఈయూ, టీఎంయూ పైచేయి సాధించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు డిపోల్లో టీడబ్ల్యూయూ కూటమి జయకేతనం ఎగురవేసినట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ఏడు డిపోల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ నాలుగు డిపోల్లో, టీడబ్ల్యూయూ రెండు, టీజేఎంయూ ఒక డిపోలో ఆధిక్యం సాధించాయి.


రీజియన్‌ ఎన్నికల్లో టీడబ్ల్యూయూ మూడు, ఈయూ, టీజేఎంయూ, టీఎంయూ ఒక్కో డిపోలో ఆధిక్యం ప్రదర్శించాయి. కరీంనగర్‌ రీజియన్లోని 11 డిపోల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల్లో రెండు డిపోల్లో టీఎంయూ కూటమి, ఒక డిపోలో ఐఎన్‌టీయూసీ కూటమి విజయం సాధించాయి. డిపో స్థాయిలో టీఎంయూ, రాష్ట్రస్థాయిలో ఐఎన్‌టీయూసీ కూటమి ముందంజలో నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్నం నుంచి పల్లెకు పయనం
కరువు కోరల్లో 130 మండలాలు

హైస్పీడ్‌ రైళ్ల అలైన్‌మెంట్‌ ఖరారు కాలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:39 AM