కరువు కోరల్లో 130 మండలాలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:20 AM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో -17 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
23 జిల్లాల్లో సేకరించిన వివరాల్లో వెల్లడి..
రాష్ట్రవ్యాప్తంగా 235 మండలాల్లో ప్రభావం
18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు
20 శాతం నుంచి -41 శాతం వరకు
సర్కారుకు చేరిన ప్రాథమిక నివేదిక
కరువుపై క్షేత్రస్థాయి సర్వేకు నిర్ణయం
జాతీయ నిబంధనావళి ప్రకారం.. 4వ దశ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం
త్వరగా పూర్తిచేసి వివరాలతో కేంద్రానికి
సాయం కోసం లేఖ రాయనున్న సర్కారు
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో -17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దాంతో భూగర్భ జలాలు పడిపోయి జలాశయాల్లోనూ నీరు అడుగంటిపోతున్న పరిస్థితి నెలకొంది. వెరసి రాష్ట్రంలో 130 మండలాల్లో కరువు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వీటిలోని 20 మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉండగా, 110 చోట్ల సాధారణంగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమికంగా సేకరించిన వివరాల్లో వెల్లడైంది. ఆ నివేదిక శుక్రవారం సర్కారుకు చేరింది. జాతీయ కరువు నిర్వహణ నిబంధనావళి ప్రకారం ఈ నెల 31 నాటికి రాష్ట్రంలో కరువు ప్రాంతాలను ఖరారు చేయాల్సి ఉందని కూడా నివేదికలో పొందుపరిచారు.
ఈ నేపథ్యంలో.. కరువు తీవ్రతపై ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి సారించింది. ఎల్‌నినో, కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి నుంచి లెక్కలు తీయిస్తోంది. ఈ మేరకు కరువు మండలాల గుర్తింపు, ప్రకటనకు సంబంధించి కీలకమైన క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. సర్వేకు సంబంధించి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ కరువు నిర్వహణ నిబంధనావళి ప్రకారం.. లోటు వర్షపాతం, దానివల్ల వచ్చిన నష్టం, నష్టం వచ్చినట్లు తెలిపే సూచికలు మొదటి మూడు అంశాలు కాగా, నాలుగో అంశమైన క్షేత్రస్థాయి మదింపును ఇప్పుడు ప్రభుత్వం చేపట్టింది. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, పూర్తి వివరాలతో కేంద్రానికి లేఖ రాయనుంది. ఇక ఇప్పటికే అందిన ప్రాథమిక నివేదికలోని అంశాలతోపాటు జిల్లాల నుంచి వచ్చే సమగ్ర వివరాలపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే అనధికార మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఆ సమావేశంలో కరువు ప్రభావిత మండలాల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాత ఏ రంగానికి ఎంతమేర సాయం కావాలన్న విషయాన్ని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాయనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
జిల్లాల వారీగా లోటు వర్షపాతం..
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఎల్‌నినో ప్రభావం, బంగాళాఖాతంలో బలహీనమైన అల్పపీడనాలు, పొడి వాతావరణం కారణంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా సాధారణంగా 740.6 మిల్లీమీటర్ల మేర నమోదు కావాల్సిన వర్షపాతం 615.5 మిల్లీమీటర్లే పడింది. దీంతో రాష్ట్రంలో -17శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో 618.9 మిల్లీమీటర్లకుగాను 456.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది.
అంటే క్యూర్ పరిధిలో సాధారణం కంటే - 26 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, మరో 18 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. వీటిలో జోగులాంబ గద్వాల జిల్లాలో - 41, నారాయణపేట, హనుమకొండ జిల్లాల్లో - 35, నల్లగొండలో -34 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 458 మండలాల్లోని కరువు పరిస్థితులపై సేకరించిన వివరాల మేరకు.. 130 మండలాల్లో కరవు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వీటిలోని 20 మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉండగా, 110 చోట్ల సాధారణంగా ఉంది. తీవ్రత ఎక్కువ ఉన్న జాబితాలో సూర్యాపేట జిల్లాలో 5 మండలాలు, రంగారెడ్డిలో 4, నల్లగొండ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 3 చొప్పున, ఖమ్మంలో 2, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి చొప్పున మండలాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు..
రాష్ట్రంలో -17 శాతం లోటు వర్షపాతం 232 మండలాల్లో నమోదైంది. ఓవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు సాధారణం కంటే తక్కువగా -41 శాతం లోటు వర్షపాతంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు కూడా రోజురోజుకూ పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సహా మరికొన్ని ఇతర రంగాలపై ప్రత్యక్ష, పరోక్షంగా తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక హైదరాబాద్ (క్యూర్ పరిధిలో) సాధారణం కంటే - 26 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా నగరంలోని చాలా ఏరియాల్లో నీళ్లకు కటకటగా మారింది. ఆయా ఏరియాల ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడుతుండడంతో ట్యాంకర్లు నింపుకొనే బోర్లపై మరింత ప్రభావం పడుతోంది
ఈ వార్తలు కూడా చదవండి:
కొందామన్నా కరెంటేదీ?
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
ఎల్‌నినోపై సీఎం ఫోకస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News