Share News

కొందామన్నా కరెంటేదీ?

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:04 AM

ఎల్‌నినో దెబ్బకు ఉక్కపోతతో గృహ విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ఖరీ్‌ఫలో పెరిగిన వరి సాగుతో వ్యవసాయ విద్యుత్‌ వాడకమూ అధికమవుతోంది.

కొందామన్నా కరెంటేదీ?
Telangana power shortage

  • యూనిట్‌ రూ.10 పెట్టినా బహిరంగ విపణిలో దొరకని విద్యుత్తు

  • దేశవ్యాప్తంగా 75వేల మెగావాట్లకు బిడ్‌.. లభ్యత 955 మెగావాట్లే

  • సోలార్‌ అవర్‌లోనూ భారీ డిమాండ్‌.. విద్యుత్తు సంస్థల విలవిల

  • జలాశయాలన్నీ ఖాళీ.. ఇక థర్మల్‌, సోలార్‌ విద్యుత్తుపైనే ఆశలు

  • డేటా సెంటర్లకు సమ్మతి లేఖలు ఆచితూచి ఇవ్వాలి: ట్రాన్స్‌కో

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో దెబ్బకు ఉక్కపోతతో గృహ విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ఖరీ్‌ఫలో పెరిగిన వరి సాగుతో వ్యవసాయ విద్యుత్‌ వాడకమూ అధికమవుతోంది. వీటికి తోడు వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా సాధారణానికి మించి పెరగడంతో.. గత పదిరోజులుగా రాష్ట్రంలో విద్యుత్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి ఉందా అంటే.. అదీ లేదు. లోటు వర్షపాతం కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని జలాశయాల్లో ఇన్‌ఫ్లోలు పూర్తిగా తగ్గడంతో అధికారులు థర్మల్‌, సోలార్‌ విద్యుత్తు మీదే ఆశలుపెట్టుకున్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేక రైతులు బోరుబావులమీదే ఆధారపడి సాగు చేస్తుండటం వల్ల విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈనెల 8న రాష్ట్రంలో 344.94 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా.. సరఫరా చేసింది 320.90 మిలియన్‌ యూనిట్లే. అంటే.. కొరత 24.04 మిలియన్‌ యూనిట్లు (నిరుడు ఇదే రోజున 225.42 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉండగా.. ఎలాంటి కోతా లేకుండా మొత్తం అందించారు. కానీ ఏడాదిలోనే వినియోగం 100 మిలియన్‌ యూనిట్లకు పైగా పెరిగిపోవడం గమనార్హం). విద్యుత్‌ అవసరాలు తీర్చడానికి బహిరంగ విపణిలో 82.93 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను కొనుగోలు చేశారు. డే ఎహెడ్‌ మార్కెట్‌ (ఒకరోజు ముందు వేసిన బిడ్లు) ప్రకారం 55.14 మిలియన్‌ యూనిట్లను యూనిట్‌ రూ.5.42కు కొనుగోలు చేయగా.. గ్రీన్‌ డే ఎహెడ్‌ మార్కెట్‌లో 2.13 మిలియన్‌ యూనిట్లను యూనిట్‌ రూ.10కి, ఆ తర్వాత రియల్‌ టైమ్‌ మార్కెట్‌లో యూనిట్‌ రూ.9.18 చొప్పున 25.66 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేశారు


దాంతో సగటున రూ.6.73కు యూనిట్‌ చొప్పున దొరికినట్టయింది. ఇక పీక్‌ డిమాండు విషయానికి వస్తే.. ఈ నెల 8వ తేదీన అత్యధికంగా 19,598 మెగావాట్లుగా ఉండటం గమనార్హం. రెండు వారాలుగా ఇంచుమించుగా నిత్యం 300 మిలియన్‌ యూనిట్లకు పైగా(అంటే రోజంతా సగటున 12,500మెగావాట్లకు పైగా) డిమాండ్‌ ఉంటోంది. కానీ.. బహిరంగ విపణిలో కొనుగోలు చేయాలంటే అంత విద్యుత్‌ దొరకని పరిస్థితి. ఉదాహరణకు.. శుక్రవారం డే ఎహెడ్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే సాయంత్రం 6 గంటల నుంచి 6:15 గంటల బ్లాక్‌లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు 75 వేల మెగావాట్ల కరెంట్‌ కోసం బిడ్లు వేయగా.. విక్రయానికి కేవలం 955 మెగావాట్ల కరెంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది.


అయితే, రాష్ట్రంలో జెన్‌కో గణనీయంగా థర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండటంతో కొంత కలిసివస్తోంది. 7500 మెగావాట్ల దాకా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంటే... సోలార్‌ 6 వేల మెగావాట్ల దాకా ఉంటోంది. బహిరంగ విపణిలో 4 వేల మెగావాట్లు కొనుగోలు చేస్తున్నారు. పగటి పూట ఎండలు పెరగడంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన గరిష్ఠంగా ఉంటోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సోలార్‌ అవర్‌ అంటారు. ఆ సమయంలో కూడా భారీగా డిమాండ్‌ ఉండటం గమనార్హం. ప్రధానంగా సాయంత్రం 3:30 గంటల నుంచి 6 గంటల దాకా భారీ డిమాండ్‌తో విద్యుత్‌ కొరత ఏర్పడుతోంది. బహిరంగ విపణిలో కొందామన్నా.. కరెంట్‌ ధరలు భగ్గుమంటున్నాయి. గరిష్ఠ ధర (డే ఎహెడ్‌ మార్కెట్‌లో ఒకరోజు) యూనిట్‌ రూ.10 దాకా ఉంటోంది. ఈ ఖరీ్‌ఫలో మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్‌ ఉండటంతో విద్యుత్‌ సంస్థలకు తిప్పలు తప్పడం లేదు. ఎల్‌నినో వల్ల నీటి కొరత తీవ్రంగా ఉంటుందని, వరి సాగు చేయవద్దని ప్రభుత్వం చెబుతున్నా ఫలితం లేకుండా పోయింది.


ప్రాజెక్టుల నీళ్లన్నీ తాగునీటి అవసరాలకే...

ఈ ఏడాది ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు నిరాశాజనకంగా ఉండడంతో ఆశించిన మేర జల విద్యుదుత్పత్తి జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా(గురువారం-8వ తేదీ దాకా) 1209 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరిగింది. ప్రస్తుతం శ్రీశైలంలో 6.40 మిలియన్‌ యూనిట్లు, సాగర్‌లో 2.93 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. మరో నెలరోజుల్లో ఇది పూర్తిగా ఆగిపోనుంది. దాంతో జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను రానున్న రోజుల్లో తాగునీటి అవసరాల కోసం కాపాడుకోనున్నారు.


డేటా సెంటర్లకు హడావుడిగా సమ్మతి వద్దు

బల్క్‌ లోడ్‌ అస్యూరెన్స్‌ కమిటీ తేల్చాకే ఇవ్వాలి.. ట్రాన్స్‌కో ఉత్తర్వులు

విద్యుత్‌ డిమాండ్‌ పెరగడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి.. డేటా సెంటర్ల ప్రభావం. రాష్ట్రంలో చిన్నాచితకా డేటా సెంటర్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా.. మరో 6200 ఎంవీఏ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లకు కరెంట్‌ ఇస్తామని ఇప్పటికే లేఖలు ఇచ్చారు. ఆ డిమాండ్‌ను తీర్చే పనులు చేయాలంటే దాదాపు ఐదేళ్లు పడుతుంది. దాంతో ఆచితూచి సమ్మతి లేఖలు ఇవ్వాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఈ మేరకు.. భారీ విద్యుత్‌ లోడ్లకు సంబంధించి మధ్యంతర హామీ లేఖల జారీ, దరఖాస్తుల పరిశీలన, అనుమతుల ప్రక్రియ, రికార్డుల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది.


మహేశ్వరం, చందనవెల్లి ప్రాంతాల్లో ప్రతిపాదిత డేటా సెంటర్లకు విద్యుత్‌ సరఫరా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల్లో కొత్త 765/400 కేవీ విద్యుత్‌ వ్యవస్థ, అనుబంధ లైన్ల నిర్మాణానికి సుమారు ఐదేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని గుర్తుచేసింది. దరఖాస్తుదారులు 2027 నుంచి 2036 వరకు, ఆ తర్వాతి కాలానికి కూడా దశలవారీగా విద్యుత్‌ లోడ్లను ప్రతిపాదిస్తున్నారని, దీని వల్ల సాధ్యాసాధ్యాల పరిశీలన పూర్తయినంత మాత్రాన విద్యుత్‌ సరఫరా చేసే పరిస్థితి లేదని గుర్తు చేసింది.


ఇకపై బల్క్‌ లోడ్‌ అస్యూరెన్స్‌ కమిటీ ధ్రువీకరించిన తర్వాతే కరెంట్‌ సరఫరాకు సమ్మతి లేఖలు జారీ చేయాలని ట్రాన్స్‌కో సీఎండీ నిర్దేశించారు. ట్రాన్స్‌కో డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌) ఈ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. దరఖాస్తులను కమిటీ పరిశీలించిన తర్వాత సీఎండీ ఆమోదానికి పంపించాలి. సమగ్ర విద్యుత్‌ వ్యవస్థ అధ్యయనాలు పూర్తయ్యే వరకూ దరఖాస్తుదారులు నిర్మాణ పనులు ప్రారంభించరాదనే షరతు కూడా విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్‌ డే పార్టీలొద్దు!
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!
పురపాలక శాఖకు రూ.5 వేల కోట్ల విదేశీ రుణంRead Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:04 AM