రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్ డే పార్టీలొద్దు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:33 AM
జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రివేళల్లో రోడ్లు, చెరువులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోకొచ్చి బర్త్‌డే పార్టీల పేరుతో హడావుడి చేయొద్దని నగర ప్రజలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ట్యాంక్‌బండ్‌పై సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్‌పై నిషేధం
చెరువులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి హడావుడి చేస్తే కఠిన చర్యలు
అదో కుటుంబ వేడుక.. ఇంట్లో లేదా సురక్షిత ప్రాంతంలోనే నిర్వహించుకోవాలి: సీపీ సజ్జనార్
ఇటీవల ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
అర్ధరాత్రి రెండింటికి వేడుక కోసం వచ్చిన ఫ్యామిలీ
లారీ ఢీ కొట్టడంతో బర్త్ డే బేబీ ఆరేళ్ల చిన్నారి, మరో వ్యక్తి మృతి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రివేళల్లో రోడ్లు, చెరువులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోకొచ్చి బర్త్‌డే పార్టీల పేరుతో హడావుడి చేయొద్దని నగర ప్రజలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. అర్ధరాత్రి రోడ్లపైకి, ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాలు, జంక్షన్‌లు, ఫ్లై ఓవర్లు తదితర చోట్ల వేడుకలు నిర్వహించినా.. కేక్ కటింగ్‌లు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల బర్త్‌డే పార్టీ వేడుక కోసం అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన ఓ కుటుంబం అక్కడ సరదగా గడుపుతుండగా ఘోరం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో బర్త్‌డే బేబీ అయిన ఆరేళ్ల చిన్నారి, ఆ కుటుంబంలోని మరో వ్యక్తి దుర్మరణంపాలయ్యారు. ఈ ప్రమాద ఘటననే సజ్జనార్ గుర్తు చేశారు. ఆరేళ్ల పాప పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు కుటుంబసభ్యులంతా కలిసి 3వ తేదీన అర్ధరాత్రి దాటాక 2గంటలకు (తెల్లవారితే ఆదివారం) ట్యాంక్ బండ్‌కొచ్చారు. అక్కడ చాలాసేపు సరదాగా గడిపారు. అయితే ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతున్న క్రమంలో ఆ చిన్నారిని, ఆమెతో పాటు రోడ్డు దాటుతున్న మరో వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఈ హఠాత్పరిణామంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కాగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేందుకుగాను ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదస్థలిని సందర్శించినట్లు సజ్జనార్ చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న ప్రమాదాల నివారణ కోసం వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించామని వివరించారు. పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వేడుక అని, దానిని ఇంటి వద్ద లేదంటే ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో మాత్రమే నిర్వహించుకోవాలని నొక్కి చెప్పారు.
అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం తక్కువగా ఉంటుందని, ఈ కారణంగా వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయని, అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని రోడ్ల మీదకు రావడం ఏమాత్రం వివేకం అనిపించుకోదని హితవు పలికారు. వేడుక పేరుతో అర్థరాత్రి రోడ్డుపైకి వచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News