Share News

దేశ ఆర్థిక వృద్ధిపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:26 AM

దేశ ఆర్థిక ప్రగతిపై వాస్తవాలను, గణాంకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

దేశ ఆర్థిక వృద్ధిపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Ramchander Rao

  • రెండు ఎమ్మెల్సీల స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించాలి

  • పార్టీ శ్రేణులకు రాంచందర్‌రావు పిలుపు

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక ప్రగతిపై వాస్తవాలను, గణాంకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోలిస్తే భారత్‌ వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తోందని, 7.1శాతం వృద్ధి రేటుతో ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.


వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న ఈ రెండుస్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. మేధావులు, విద్యావంతులను కలిసి దేశ ఆర్థిక ప్రగతిని వివరించాలని, ఇందుకు అవసరమైన గణాంకాలు, సమాచారాన్ని పార్టీ శ్రేణులకు అందిస్తామని చెప్పారు. అమెరికా 2.3 శాతం, యూరప్‌ 1.3 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే భారత్‌ 7.1శాతం వృద్ధి సాధిస్తోందన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, మూడీస్‌, ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం భారత ఆర్థిక వృద్థిపై సానుకూల అంచనాలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ‘గరీబీ హఠావో’ నినాదానికే పరిమితమైందన్నారు. మోదీ హయాంలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయన్నారు.


ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం సుమారు 50కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 2014కు ముందు 27.10 శాతంగా ఉన్న తీవ్రపేదరికం ప్రస్తుతం 2.6శాతానికి తగ్గిందని చెప్పారు. యూపీఏ హయాంలో 9.49 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 2.1 శాతానికి దిగివచ్చిందన్నారు. గతంలో 30 నుంచి 31 శాతం వరకు ఉన్న పరోక్ష పన్నుల భారం జీఎస్టీతో సుమారు 9.5 శాతానికి తగ్గిందని వివరించారు. ప్రపంచ దేశాల నేతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం భారత ఆర్థిక ప్రగతిని ప్రశంసిస్తున్న తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విదేశీ వేదికలపై భారత్‌ ఆర్థిక వ్యవస్థను ‘డెడ్‌ ఎకానమీ’గా అభివర్ణించడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని రాంచందర్‌రావు మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 05:26 AM