గ్రామాలకు డిజిటల్ విప్లవం
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:14 AM
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ కల్పించే విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌కు లైన్ క్లియర్
‘అమెండెడ్ భారత్‌నెట్’-రాష్ట్ర ప్రభుత్వం మధ్యకుదిరిన ఒప్పందం
ఫలించిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు యత్నాలు
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ కల్పించే విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ‘అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్’ (ఏబీపీ) కింద ఉన్న డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్)-తెలంగాణ ప్రభుత్వం మధ్యఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కీలక ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని సంచార్ భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఐటీశాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, టీ-ఫైబర్ ఎండీ పన్నీరు వేణుప్రసాద్ ప్రత్యక్షంగా పాల్గొనగా, వర్చువల్ విధానంలో ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికా్‌సరాజ్, పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్‌మిత్తల్, ఆర్థికశాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
కేంద్రం తరఫున డీబీఎన్ అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, ఏబీపీ ఇంప్లిమెంటేషన్-1 డైరక్టర్ హర్ష్, బీఎస్ఎన్‌ఎల్ భారత్‌నెట్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజారామ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు మెరుగైన ఇంటర్నెట్ సదుపాయలు అందుబాటులోకి రానున్నాయి. ఒప్పందం కింద కేంద్రప్రభుత్వం రూ.3,189 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించడంతోపాటు ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌ను ఆధునీకరించనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రభుత్వ సేవలను డిజిటల్ విధానంలో గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది దీని లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్‌ఐఐసీఎల్) ఈ ప్రాజెక్టు అమలులో కీలక పాత్ర పోషించనుంది. టీ-ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ కార్పొరేషన్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు.
2.93 లక్షల ఇళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించనున్నారు. దీనికి సుమారు రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.10 వేల చొప్పున కేంద్రం నుంచి ఆర్థికసాయం అందనుంది. నెట్ కనెక్షన్లను అందించే క్రమంలో గ్రామపంచాయతీల్లో ఇప్పుడున్న డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయనున్నారు. దీంట్లోభాగంగా 1946 పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న లీనియర్ టోపాలజీ నెట్‌వర్క్‌ను రింగ్ టోపాలజీగా మారుస్తారు. రింగ్ టోపాలజీ అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే కేబుల్‌ను రింగ్ మాదిరిగా అనుసంధానిస్తారు. ఒక మార్గంలో సమస్య ఏర్పడినా.. మరో మార్గం ద్వారా కనెక్షన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రింగ్ టోపాలజీ నెట్‌వర్క్ దాదాపు 10,787 గ్రామాల్లో ఉంది. కాగా, కొత్తగా ఏర్పాటైన 36 గ్రామ పంచా యతీలను కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తారు. మరోవైపు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్తగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా టెండర్లను పిలవనున్నారు.
నెట్‌వర్క్ కల్పనతో ఆదాయం
గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఉపయోగిస్తున్న భారత్‌నెట్ మౌలిక వసతులను వాణిజ్యపరంగానూ వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నెట్‌వర్క్‌ను మానిటైజేషన్ కోసం టెండర్లు పిలవనున్నారు. నెట్‌వర్క్ నిర్వహణ వ్యయానికి అవసరమైన ఆదాయ మార్గా లు దీనిద్వారా ఏర్పడుతాయని అంచనా. కాగా జిల్లా, మండల కేంద్రాల నెట్‌వర్క్ మౌలిక వసతుల నిర్వహణను టీ-ఫైబర్ కొనసాగించనుండగా, గ్రామపంచాయతీలకు నెట్‌వర్క్ విస్తరణ, భారత్ నెట్‌వర్క్ అమలు, నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్‌ఐఐసీఎల్) చేపట్టనుంది.
ప్రాజెక్టుపై సీఎం, మంత్రి ప్రత్యేక దృష్టి
ఈ ప్రాజెక్టుకోసం సీఎం రేవంత్, ఐటీమంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టిసారించారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లలో సీఎం పాల్గొన్నారు. సీఎం, మంత్రి వేగంగా స్పందించడంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని అధికారికవర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News