Share News

అవినీతి కేసు నుంచి తప్పించడానికి 30 లక్షలు లంచం!

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:31 AM

విద్యుత్తు శాఖలో ఇబ్రహీంబాగ్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ అంబేద్కర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

అవినీతి కేసు నుంచి తప్పించడానికి 30 లక్షలు లంచం!

  • ఏసీబీ అధికారులు డిమాండ్‌ చేశారు

  • రూ.5 లక్షలు తీసుకున్నారు కూడా..

  • అక్రమాస్తుల కేసులో అరెస్టయిన విద్యుత్‌ శాఖ ఏడీఈ ఆరోపణలు

  • ఏసీబీ డీజీకి ఫిర్యాదు

  • ఏసీబీలో అవినీతికి అవకాశమే లేదు

  • ఆరోపణలు రుజువైతే ఎవర్నీ వదలం

  • ఫిర్యాదుదారు విచారణకు రాలే: డీజీ

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు శాఖలో ఇబ్రహీంబాగ్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ అంబేద్కర్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, ఆ కేసులో తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి ఏసీబీ అధికారులు లంచం డిమాండ్‌ చేశారని అంబేద్కర్‌ ఆరోపించారు. అంతేకాదు ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు. అక్రమాస్తుల కేసులో తనను అరెస్టు చేయడంతో పాటు తన స్థాయి ఉద్యోగి అయిన రాజేశ్‌ తనకు బినామీ అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. తన వాదనను పరిగణనలోకి తీసుకోలేదని, తాను చూపిన ఆదాయపత్రాలను పరిశీలించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులైన ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌ కుమార్‌, డీఎస్పీ ఆనంద్‌కుమార్‌లు తనను సంప్రదించారని.. కేసులో తన బినామీగా పేర్కొన్న రాజేశ్‌ను అందులో నుంచి తప్పించడానికి రూ.15 లక్షలు, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో రూ.15 లక్షలు డిమాండ్‌ చేశారని తెలిపారు.


ఇందులో రూ.5 లక్షలు సుధీర్‌ కుమార్‌ తీసుకున్నారని, అందుకు సంబంధించి ఆడి యో రికార్డింగ్‌లను అందజేస్తున్నట్లు ఫిర్యాదులో వివరించారు. తన ఫిర్యాదు ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్‌ ఆరోపణలు వైరల్‌ కావడంతో ఏసీబీ డీజీ స్పందించారు. ఏసీబీలో అవినీతికి అవకాశమే లేదని, చట్టానికి ఎవరూ అతీతులు కారని ఓ ప్రకటనలో తెలిపారు. ఏసీబీ అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామన్నారు. ఫిర్యాదుదారుడ్ని మూడు సార్లు పిలిస్తే.. ఒక్కసారి కూడా విచారణకు హజరు కాలేదని వెల్లడించారు. ఆరోపణలు నిజమని తేలితే ఎవరినీ ఉపేక్షించబోమని డీజీ ప్రకటించారు. ఆయన ప్రకటన వచ్చిన తర్వాత మరోసారి అంబేద్కర్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఏసీబీ అధికారులు క్రిమినల్‌ నేరానికి పాల్పడ్డారన్నారు. దానిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా శాఖాపరమైన విచారణ చేస్తున్నామని చెప్పడం అంటే.. అధికారులను చట్టపరమైన చర్యల నుంచి తప్పించి, వారికి రక్షణ కల్పించడమేనన్న అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 04:31 AM