Share News

ఏసీబీకి కొత్త జవసత్వాలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 04:35 AM

అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద దర్యాప్తునకు ప్రభుత్వ ముుందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో అవినీతి నిరోధక శాఖకు(ఏసీబీ) కొత్త జవసత్వాలు సమకూరనున్నాయి.

ఏసీబీకి కొత్త జవసత్వాలు
ACB Telangana

  • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక దూకుడు!

  • లంచగొండులపై దర్యాప్తునకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న అత్యున్నత న్యాయస్థానం

  • అనుమతి లేక ఇంతకాలంగా నీరుగారిపోతున్న కేసులు

  • 19సార్లు లేఖలు రాసినా ఓ కేసులో రాని అనుమతి

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద దర్యాప్తునకు ప్రభుత్వ ముుందస్తు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో అవినీతి నిరోధక శాఖకు(ఏసీబీ) కొత్త జవసత్వాలు సమకూరనున్నాయి. తెలంగాణలో ఉన్న ఏసీబీ కేసుల్లో విచారణ వేగంగా జరిగే అవకాశాలున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారు, లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడినవారి విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసినప్పుడే కొంత హడావిడి కనిపించినా.. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో నిందితుల మీద న్యాయవిచారణ జరగటం లేదు.


అవినీతి కేసులో ఓ అధికారి విచారణకు అనుమతి కోరుతూ ఏసీబీ ఉన్నతాధికారులు 19సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా కూడా అనుమతి రాకపోవడంతో కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం రెవెన్యూ శాఖకు సంబంధించి 2014 వరకు 101 ప్రాసిక్యూషన్‌ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. 2021 నాటికి వాటి సంఖ్య 323కి పెరిగింది. కేవలం 5 కేసుల్లో మాత్రమే అనుమతి లభించింది. గతేడాది చివరికి మొత్తం 650 కేసులకుగాను 115 కేసుల్లో ప్రాసిక్యూషన్‌ అనుమతులు వచ్చాయి. చాలా కేసుల్లో సదరు ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ న్యాయవిచారణకు అనుమతి తిరస్కరిస్తున్నారు. ఒక అవినీతిపరుడైన ప్రభుత్వోద్యోగిపై ఏసీబీ దర్యాప్తు పూర్చి చేసినప్పటికీ.. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఇటువంటి వారికి పగ్గాలు వేసి, చట్టపరంగా శిక్షించే అవకాశం లభిస్తుంది.


రాజస్థాన్‌ కానిస్టేబుల్‌ కేసులో సుప్రీంతీర్పు

తన మీద నమోదైన అవినీతి ఆరోపణలపై న్యాయవిచారణ జరగటాన్ని సవాల్‌ చేస్తూ రాజస్థాన్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ తేజారాం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి మీద దర్యాప్తు జరపటానికి ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియను పాటించకుండానే తనపై విచారణ జరిపారని పేర్కొన్నారు. ఈ వాదనను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగి అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి దర్యాప్తు జరపాలంటేనే ముందస్తు అనుమతి అవసరమని సెక్షన్‌ 17ఏ చెబుతోందని, లంచం తీసుకోవటం వంటి అవినీతి కార్యకలాపాలకు ఆ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి, జస్టిస్‌ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పును వెలువరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దు: సీతక్క

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వేగం పెంచాలి: భట్టి

ఆర్టీసీ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్‌!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 20 , 2026 | 04:35 AM