Share News

ఆధార్‌ ఉంటేనే రూ.500కు గ్యాస్‌!

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:29 AM

మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న లబ్ధిదారులు ఇకపై తప్పనిసరిగా ఆధార్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్‌ ఉంటేనే రూ.500కు గ్యాస్‌!

  • మహాలక్ష్మి లబ్ధిదారులకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

  • కార్డు లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి

  • అథెంటికేషన్‌ విఫలమైనా ప్రత్యామ్నాయ మార్గాల్లో సిలిండర్‌

  • లబ్ధిదారుల వివరాల అనుసంధానానికి ప్రభుత్వ మార్గదర్శకాలు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పొందుతున్న లబ్ధిదారులు ఇకపై తప్పనిసరిగా ఆధార్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. పథకం లబ్ధిదారుల వివరాలను ఆధార్‌తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్‌ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కార్డు వచ్చే వరకు ఆధార్‌ దరఖాస్తు ఐడెంటిఫికేషన్‌ స్లిప్‌తో పాటు ప్రభుత్వం సూచించిన పది గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో పారదర్శకత పెంచడంతో పాటు అర్హులైన వారికే ప్రయోజనం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఇప్పటికే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు గ్యాస్‌ వినియోగదారుల వివరాలు సేకరించగా, పౌర సరఫరాల శాఖ వద్ద ఆహార భద్రతా కార్డుల సమాచారం ఉంది. ఈ వివరాలను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా అర్హులను గుర్తించడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ముందుగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు చెల్లిస్తోంది. అనంతరం ఆ మొత్తాన్ని డీబీటీ విధానంలో వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తప్పనిసరిగా తమ ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలను సంబంధిత ఏజెన్సీలకు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌ లేని లబ్ధిదారులు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:29 AM