Share News

‘నిషేధం’ వీడేదెన్నడో!

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:08 AM

అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధిత ఆస్తుల జాబితా 22ఏలో చేరిన పట్టా భూములు, ప్రైవేటు భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్లను అందులో నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. సమస్య పరిష్కారం కావడంలేదు.

‘నిషేధం’ వీడేదెన్నడో!

  • 22ఏ జాబితా నుంచి తొలగింపునకు నోచుకోని పట్టా భూములు, అపార్టుమెంట్లు

  • ప్రభుత్వం ఆదేశించినా పట్టనిఅధికారులు

  • తుర్కయాంజల్‌లో 30 ఎకరాల ప్రైవేటు భూమి, 25 ఎకరాల భూదాన్‌ భూమి నిషేధిత జాబితాలోకి

  • ఎన్‌వోసీ ఇచ్చేందుకు డబ్బు వసూలు?

  • తుర్కయాంజల్‌లో 200 గజాల ప్లాటు

  • ఎన్‌వోసీకి 5 లక్షలు ఇచ్చిన బాధితుడు!

హయత్‌నగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధిత ఆస్తుల జాబితా 22ఏలో చేరిన పట్టా భూములు, ప్రైవేటు భూములు, ప్లాట్లు, అపార్టుమెంట్లను అందులో నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినా.. సమస్య పరిష్కారం కావడంలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి చెప్పినా క్షేత్రస్థాయిలో అధికారులు ఆ జాబితా నుంచి వాటిని తొలగించడంలేదు. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ప్రభుత్వ సర్వేనంబర్‌ 323లో మొత్తం 45.29 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి ప్రభుత్వం 1961-62 సంవత్సరంలో ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులకు ఒక్కొక్కరికి 10 ఎకరాల చొప్పున 30 ఎకరాలను కేటాయించింది.


దీంతో కాలక్రమేణా అవి లేఅవుట్‌లుగా మారి.. శ్రీశ్రీ విహార్‌, సాగర్‌ ఎన్‌క్లేవ్‌, కేఎ్‌సఆర్‌ నగర్‌, సాగర్‌ రెసిడెన్సీ కాలనీలుగా ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు 350 కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేశాయి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, అనుమతుల ద్వారా పూర్తిగా ఇళ్లు, అపార్టుమెంట్లు కట్టుకున్నారు. సదరు సర్వే నంబర్‌లో ఇంకా 15.29 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో భూ రికార్డులను ధరణి నుంచి భూభారతి పోర్టల్‌కు మార్చే సమయంలో 323 సర్వే నంబర్‌ మొత్తాన్ని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు.


మరోవైపు సర్వే నంబర్‌ 284, 285లోని సుమారు 25 ఎకరాల భూదాన్‌ భూమి 1985 నుంచి 1990 మధ్య కాలంలో లేఅవుట్‌గా మారి ఓం గణేష్‌నగర్‌‌, గణేష్‌నగర్‌‌ ఫేజ్‌-2, 3గా కాలనీలు, అపార్టుమెంట్లు వెలిశాయి. దీంతోపాటు బాటసింగారంలోని పట్టా సర్వే నంబర్‌ 2/1లో 17 ఎకరాల లేఅవుట్‌ను 22ఏలో చేర్చారు. ఈ కాలనీలను ఇలా నిషేధిత జాబితాల్లో చేర్చడంతో కొద్ది నెలలుగా క్రయ విక్రయాలు ఆగిపోయాయి. రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో స్లాట్‌బుక్‌ కాకుండా సేవలు నిలిచిపోయాయి. దీంతో తమ ఇంటిపై బ్యాంకు రుణం తీసుకోవాలన్నా, ఇంటి నిర్మాణానికి రుణాలు తీసుకోవాలన్నా రావడం లేదని బాధితులు వాపోతున్నారు.


ఎన్‌ఓసీ కోసం రూ.లక్షల్లో వసూలు..?

తమ భూమి, ఇల్లు నిషేధిత జాబితాలో లేవంటూ ఇచ్చే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోసం కొందరు రెవెన్యూ అధికారులు బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుర్కయాంజల్‌ పరిధిలో ఓ బిల్డర్‌ తన 200 గజాల ప్లాటుకు కావాల్సిన ఎన్‌వోసీ కోసం ఓ అధికారికి రూ.5లక్షలు ఇచ్చి సర్టిఫికెట్‌ పొందినట్లు తెలిసింది. సదరు అధికారికి రూ.5 లక్షలు ఇస్తే అన్ని తానై పనిచేసి సర్టిఫికెట్‌ తీసుకొచ్చి ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల రెవెన్యూ యంత్రాంగం, సబ్‌ రిజిస్ట్రార్లతో సమావేశమై 22ఏ సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెవెన్యూశాఖ కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీతో చర్చలు జరిపి నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ.. 22ఏ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బాధితులు నిత్యం తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 05:08 AM