15 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:25 AM
రాబోయే వ్యవసాయ సీజన్లపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆహార భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజా పంపిణీ అవసరాలను కనీసం 15 నెలల పాటు తీర్చగలిగేలా సన్నబియ్యం నిల్వలను సిద్ధం చేయాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు ఆగొద్దు
రూ. 500 బోనస్‌పై విస్తృత ప్రచారం కల్పించండి: ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాబోయే వ్యవసాయ సీజన్లపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆహార భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజా పంపిణీ అవసరాలను కనీసం 15 నెలల పాటు తీర్చగలిగేలా సన్నబియ్యం నిల్వలను సిద్ధం చేయాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, సన్నబియ్యం నిల్వలపై బుధవారం ఆయన పౌరసరఫరాల శాఖ కమిషనర్ వై. నాగిరెడ్డితో సమీక్ష నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తి తగ్గినప్పటికీ తెలంగాణ ఆహార భద్రతా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడకుండా ఇప్పటి నుంచే పటిష్ఠమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం దాదాపు 14 నెలలకు సరిపడా సన్నబియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించవద్దని స్పష్టం చేశారు.
సన్నబియ్యం పంపిణీ పథకానికి నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ధాన్యం కొనుగోళ్లను పెంచాలని సూచించారు. క్వింటాల్‌కు రూ.500బోన్‌సకు అర్హత కలిగిన ఏడు రకాల సన్నధాన్యం గురించి కొనుగోలు కేంద్రాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కరవు పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ దుకాణాల ద్వారా అందించే నిత్యావసర సరుకుల జాబితాను పెంచాలని ఆదేశించారు. వాటిని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనకు సమర్పిస్తామని చెప్పారు. పౌరసరఫరాల సంస్థ నిల్వ సామర్థ్యాన్ని పటిష్ఠం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక సైలో ఆధారిత గోదాములను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి బకాయిపడిన మిల్లర్ల నుంచి ప్రతి రూపాయినీ వసూలు చేసేందుకు చర్యలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
రూ.10 వేల కోట్లతో జల సంరక్షణ
వాతావరణ మార్పులు, ఎల్‌నినో పరిస్థితుల వల్ల తలెత్తే సవాళ్లకు శాస్త్రీయంగా నిరూపితమైన, ఆచరణలో అమలు చేయగల పరిష్కారాలను తెలంగాణ క్లైమెట్ కాంక్లేవ్ ప్రపంచం ముందుంచాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. కరువును తట్టుకునే విధానాలు, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై కాంక్లేవ్ కేంద్రీకృతం కావాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న క్లైమెట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. 5 నెలలపాటు జలవనరుల సంరక్షణపై రూ.10వేల కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News