తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్.. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ABN , Publish Date - Mar 12 , 2026 | 02:06 PM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణను ముగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫిరాయింపు కేసుకు సంబంధించి తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం నాడు సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం నేడు తుది తీర్పు వెలువరించింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసును జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించగా.. స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. దీంతో ఈ సమస్య సభాపతి కార్యాలయంలోనే ముగిసిందన్నారు. సింఘ్వీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ వ్యవహారంపై స్పీకర్ ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నందున విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. దీంతో కోర్టు విచారణ ముగిసినట్లేనని వెల్లడించింది.
స్పీకర్ ఆదేశాలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత పిటిషనర్లకు కావాల్సిన డాక్యుమెంట్లను కూడా నాలుగు రోజుల్లో అందజేయాలని సూచించింది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు సభాపతి క్లీన్ చిట్ ఇచ్చినట్టైంది.
ఇవీ చదవండి:
హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..
ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు