ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు
ABN , Publish Date - Mar 12 , 2026 | 07:54 AM
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద అంశాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చేందుకు కారకులైన ముగ్గురు నిపుణులకు ఇకపై ప్రభుత్వ సంబంధిత బాధ్యతలు అప్పగించవద్దని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో 'న్యాయ వ్యవస్థలో అవినీతి' పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. న్యాయ వ్యవస్థలో నెలకొన్న అవినీతి గురించి వివాదాస్పద అంశంగా పాఠ్యపుస్తకంలో చేర్చడంపై ఎన్‌సీఈఆర్‌టీ.. సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని ప్రొ.మైఖేల్ డానినో సహా టెక్స్ట్‌బుక్ డెవలప్‌మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లు రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. 'ప్రొ.మైఖేల్ డానినో, ఆయన సహచరులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లకు భారత న్యాయవ్యవస్థను గురించిన సరైన పరిజ్ఞానం లేకుండా ఉండాలి, లేదా విద్యార్థుల ముందు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను వక్రీకరించి తప్పుగానైనా చూపించి ఉండాలి' అని పేర్కొంది. ఇకపై రాబోయే తరం విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల రూపకల్పన ప్రక్రియలో ఆ ముగ్గురి ప్రమేయం ఉండకూడదని, వారిని తక్షణమే పక్కనపెట్టాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధలుతో పూర్తిగా లేదా పాక్షికంగా సంబంధమున్న ఎలాంటి బాధ్యతలనూ అప్పగించకూడదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయవ్యవస్థ గురించి విద్యార్థులకు బోధించడం మంచి విషయమే అయినప్పటికీ.. సంబంధిత పాఠ్య ప్రణాళిక తయారీలో కనీసం ఒక్క న్యాయ నిపుణుడికీ అవకాశం కల్పించకపోవడం తమకు అసంతృప్తి కలిగిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్‌ఈసీఆర్‌టీ లీగల్ స్టడీస్‌కు సంబంధించి పాఠ్యప్రణాళిక రూపకల్పనలో న్యాయ రంగానికి చెందిన నిపుణులతో వారం రోజుల్లోగా ఓ కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీలో మాజీ సీనియర్ న్యాయమూర్తి, ఓ ప్రసిద్ధ న్యాయవాది సహా ప్రముఖ విద్యావేత్త ఒకరుంటే బాగుంటుందని అభిప్రాయపడింది. వీరు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీతో సంబంధం ఉన్నవారైతే మరింత మంచి విషయాన్ని పొందుపరిచేందుకు అవకాశముంటుందని తెలిపింది.
అలా చేస్తే చర్యలు తప్పవు..
వివాదాస్పద ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 26న తీర్పు వెలువరించగా.. దానిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సామాజిక మాధ్యమ వేదికలు, వ్యక్తుల వివరాలను తమకు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ఇష్టానురీతిన వ్యాఖ్యలు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
గ్యాస్ సిలిండర్ల కొరత.. ఇండక్షన్ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..