గ్యాస్ సిలిండర్ల కొరత.. ఇండక్షన్ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:50 AM
గ్యాస్ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. జనం వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్‌లలో ఇండక్షన్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇండియాకు ఆయిల్, గ్యాస్, ఎరువుల సరఫరాలో ఆటంకం ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. పుకార్ల నేపథ్యంలో డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల కోసం జనం ఎగబడుతున్నారు. కొన్ని నగరాల్లో డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా దారుణంగా మారింది. గ్యాస్ బుక్ చేసుకుని 10 రోజులు అవుతున్నా డెలివరీ కాని పరిస్థితి ఉంది. దీంతో జనం ప్రత్యామ్నాయ మార్గాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో ఇండక్షన్‌లకు పెరిగిన డిమాండ్
గ్యాస్ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. జనం వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్‌లలో ఇండక్షన్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఈ దెబ్బకు ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌ల కొరత మొదలైంది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఇండక్షన్ స్టవ్‌లు అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నాయి. పీటీఐ కథనం ప్రకారం.. టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమాలో గత కొద్దిరోజుల నుంచి ఇండక్షన్ స్టవ్‌ల సేల్స్ మూడు రెట్లు పెరిగాయి.

అదే విధంగా, పిజియాన్, గిల్మా వంటి కంపెనీలకు చెందిన ఇండక్షన్ స్టవ్‌లు అమ్ముతున్న స్టవ్‌క్రాఫ్ట్ లిమిటెడ్‌లోనూ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. కాగా, దేశంలో డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుక్ చేసుకున్న 2.5 రోజుల్లో సిలిండర్లు డెలివరీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని అంటున్నారు. అయినప్పటికి జనం మాత్రం భయం వీడటం లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇండక్షన్ స్టవ్‌లను కొనిపెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
షేర్ మార్కెట్ పేరిట రూ.27లక్షల సైబర్ మోసం
స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..