‘స్పెక్ట్రా’కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:55 AM
రియల్ ఎస్టేట్ కుంభకోణం, భారీగా రెరా నిబంధనల ఉల్లంఘన, భారీ ఎత్తున నిధుల అక్రమ మళ్లింపు తదితర ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ స్పెక్ట్రా గ్రూప్ కంపెనీలైన స్పెక్ట్రా ఇండియా ఎకో ప్రాజెక్ట్స్, స్పెక్ట్రా ఇండియా హౌసింగ్, స్పెక్ట్రా ఇండియా మెగా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ తదితర కంపెనీలను హైకోర్టు ఆదేశించింది.
రియల్ ఎస్టేట్ స్కాం ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ కుంభకోణం, భారీగా రెరా నిబంధనల ఉల్లంఘన, భారీ ఎత్తున నిధుల అక్రమ మళ్లింపు తదితర ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ స్పెక్ట్రా గ్రూప్ కంపెనీలైన స్పెక్ట్రా ఇండియా ఎకో ప్రాజెక్ట్స్, స్పెక్ట్రా ఇండియా హౌసింగ్, స్పెక్ట్రా ఇండియా మెగా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ తదితర కంపెనీలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. స్పెక్ట్రా గ్రూప్ కంపెనీలు భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడ్డాయని పేర్కొంటూ ‘ది రైట్ సొసైటీ’ అనే సంస్థ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.
దీనిపై బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శాంకోషీ, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామనే హామీతో స్పెక్ట్రా గ్రూప్ కంపెనీలు ప్రజల నుంచి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా వసూలు చేశారని.. ఈ నిధులను అక్రమంగా గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా ఆర్థిక, రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. వివరణ సమర్పించాలంటూ స్పెక్ట్రా గ్రూప్ కంపెనీలను ఆదేశిస్తూ, విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News