Share News

సోనియా సినిమాకు క్రాంతిమాధవ్‌ దర్శకత్వం

ABN , Publish Date - Nov 30 , 2026 | 03:52 AM

సోనియాగాంధీ ఆత్మకథ... ‘బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం ఆధారంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి తీయబోయే సినిమాకు ప్రముఖ సినీ దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించనున్నారు.

సోనియా సినిమాకు క్రాంతిమాధవ్‌ దర్శకత్వం

  • ఎంపిక చేసిన తూర్పు జగ్గారెడ్డి

  • గతంలో ‘ఓనమాలు’, ‘మళీ మళ్లీ ఇది రానిరోజు’ వంటి సినిమాలు తీసిన క్రాంతిమాధవ్‌

  • ‘బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం ఆధారంగా సినిమా

  • సోనియా అనుమతి కోసం డిసెంబరు 10న ఢిల్లీకి జగ్గారెడ్డి

  • సినిమా కోసం ఎవరివద్దా డబ్బులు తీసుకోబోం: జగ్గారెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): సోనియాగాంధీ ఆత్మకథ... ‘బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం ఆధారంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి తీయబోయే సినిమాకు ప్రముఖ సినీ దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఆదివారం తన కార్యాలయంలో క్రాంతి మాధవ్‌తో భేటీ అయిన జగ్గారెడ్డి, గాంధీభవన్‌ పీఆర్వో హరిప్రసాద్‌లు.. ఆయన్ను దర్శకునిగా ఎంపిక చేశారు. ఈ భేటీలో పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ సైతం పాల్గొన్నారు. గతంలో ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వంటి ప్రయోగాత్మక సినిమాలకు క్రాంతిమాదవ్‌ దర్శకత్వం వహించారు.


కాగా.. సోనియాగాంధీ ఆత్మకథ.. ‘బిలాంగింగ్‌ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంలోని ప్రధాన అంశాలు కథాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు.. ఆమె అనుమతిని తీసుకోవడం కోసం డిసెంబరు 10న జగ్గారెడ్డి.. ఢిల్లీకి వెళ్తున్నారు. సోనియాగాంధీ ఈ పుస్తకంలో ప్రస్తావించిన గాంధీ కుటుంబ నేపథ్యం ఆధారంగా ఈ సినిమా తీయనున్నట్టు ఇప్పటికే జగ్గారెడ్డి ప్రకటించారు. సోనియా, రాజీవ్‌ల ప్రేమ కథ, ఇందిర, రాజీవ్‌ గాంధీల బలిదానాలు, దేశం కోసం వారి త్యాగాలు, ఇందిర, రాజీవ్‌ల మరణం అనంతరం దేశం కోసం సోనియా చేసిన సేవలు, ప్రజల కోసం ఆమె రాజకీయ ప్రవేశం.. ప్రధానమంత్రి పదవినీ త్యాగం చేయడం వంటివన్నీ ఈ సినిమాలో స్పష్టంగా చూపించనున్నారు. సోనియా రాసిన ఆత్మకథ పుస్తకాన్ని దేశవిదేశీ ప్రజలకు మరింత స్పష్టం గా అర్థమయ్యేలా చూపించేందుకు సినిమా తీస్తున్నామని జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎవరి నుంచి ఒక్క పైసా తీసుకోబోమని, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 50 మంది కార్యకర్తలతో ఫైనాన్స్‌ కమిటీని వేసి.. తామే సినిమా తీస్తామని ఆయన చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర.. వచ్చే వారమూ అదే సీన్!

ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 30 , 2026 | 03:52 AM