Share News

ప్రేమ, ధైర్యం, సేవలతో నిండిన జీవితం..

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:26 AM

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం రాజకీయ జ్ఞాపకాల పుస్తకం మాత్రమే కాదని, ఇటలీ నుంచి భారతదేశం వరకు సాగిన ఒక ప్రయాణమని నీటి పారుదలశాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు.

 ప్రేమ, ధైర్యం, సేవలతో నిండిన జీవితం..
Uttam Kumar Reddy

  • సోనియా ‘బిలాంగింగ్‌: జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంపై.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

  • దేశాన్ని సొంతిల్లులా మార్చుకున్న గొప్ప నాయకురాలు

  • క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ను నిలబెట్టిన వైనం

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకం రాజకీయ జ్ఞాపకాల పుస్తకం మాత్రమే కాదని, ఇటలీ నుంచి భారతదేశం వరకు సాగిన ఒక ప్రయాణమని నీటి పారుదలశాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. ప్రేమ, విషాదం, సేవ, ఈ దేశంతో ఏర్పడిన అనుబంధం, భారత ప్రజల పట్ల అంకితభావాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు. జర్నీ ఆఫ్‌ లవ్‌ పుస్తకంపై ఆయన పుస్తక సమీక్ష చేశారు. ఇటలీలో బాల్యం నుంచి కేంబ్రిడ్జ్‌లో రాజీవ్‌ గాంధీతో పరిచయం, ఆ తరువాత భారత్‌కు రావడం, దేశాన్ని తన ఇంటిగా చేసుకోవడం వరకు సోనియా గాంధీ జీవన ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తోందని పేర్కొన్నారు.


సంజయ్‌ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల మరణాలు దేశంతో పాటు ఒక కుటుంబాన్ని కుదుపేసినా, ఆ సంఘటనల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతోందని చెప్పారు. ఒక భార్యగా, తల్లిగా సోనియా వ్యక్తిగత జీవితాన్ని దేశ చరిత్రతో పుస్తకం ముడిపెట్టి చూపించిందన్నారు. ఎన్నో వ్యక్తిగత దాడులు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ సంయమనం, హుందాతనంతోనే వ్యవహరించారని తెలిపారు. ఏళ్ల తరబడి రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకున్న సోనియాగాంధీ.. చివరకు క్లిష్ట సమయంలో పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. 2004లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు మద్దతు ఇవ్వడం ఆమె వ్యక్తిగత నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.


తాను భారత వాయుేసనలో ఫైటర్‌ పైలట్‌గా రాష్ట్రపతి భవన్‌లో పనిచేస్తున్న సమయంలోనే రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీలను తొలిసారి కలిశానని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత సోనియాగాంధీ తనపై అపారమైన విశ్వాసం ఉంచి మంత్రిగా, ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం సోనియా వల్లే లభించిందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 06:26 AM