Share News

హైదరాబాద్‌లో విషాదం.. చికిత్స పొందుతూ శిశువు మృతి.. బంధువుల ఆందోళన..

ABN , Publish Date - Feb 21 , 2026 | 06:14 PM

సన్ సిటి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..

హైదరాబాద్‌లో విషాదం.. చికిత్స పొందుతూ శిశువు మృతి.. బంధువుల ఆందోళన..
Six Month Old Infant Dies

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఓ ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే సాధారణ జ్వరంతో ఆస్పత్రికి వెళ్లామని.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


ఏం జరిగిందంటే..

పోలీసుల కథనం మేరకు.. సన్ సిటీకి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా.. ఇటీవల బాబు జన్మించాడు. ఆరు నెలల వయసున్న బాబుకు స్వల్పంగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే జ్వరంతో వెళ్లిన బాబుకు.. వైద్యులు అత్యవసర సమయాల్లో (Emergency) ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే పసికందు శరీరం రంగు మారిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యం గడువు ముగిసిన (Expired) మందులు ఇచ్చిందని, దీనివల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన బాబు కావడంతో అల్లారుముద్దుగా చూసుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

శిశువు మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 06:37 PM