Share News

నైనీ నుంచి రోజూ 20 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాలి

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:41 AM

ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచి... రోజుకు కనీసం 20 వేల టన్నుల బొగ్గును రవాణా చేయాలని సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్‌ అధికారులను ఆదేశించారు.

నైనీ నుంచి రోజూ 20 వేల టన్నుల  బొగ్గు రవాణా చేయాలి
Singareni Naini Coal Block

  • అందుకు ఉత్పత్తి పెంచాలి

  • సింగరేణి సీఎండీ ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తిని పెంచి... రోజుకు కనీసం 20 వేల టన్నుల బొగ్గును రవాణా చేయాలని సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన నైనీ గనిపై సంస్థ డైరెక్టర్లు, సంబంధిత జనరల్‌ మేనేజర్లతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఎల్‌ నినో నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌ అవసరాల కోసం నైనీ గని నుంచి రోజుకు కనీసం 20 వేల టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఓవర్‌ బర్డెన్‌ తొలగింపును పెంచడం వల్ల ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నైనీ గని జనరల్‌ మేనేజర్‌ బైద్య ప్రస్తుతం గనిలో జరుగుతోన్న బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు తదితర అంశాలను వివరించారు. బొగ్గు రవాణా సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్‌ కోరారు. ఈ సమీక్ష కార్యక్రమంలో డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో సింగరేణికి ప్రశంసలు

బొగ్గు రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలులో సింగరేణి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. కోల్‌కతాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున హైదరాబాద్‌ కార్యాలయ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, పరిపాలనాధికారి నిమ్మ భాస్కర్‌, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఎం.డి. గౌస్‌ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రతినిధిగా నిమ్మ భాస్కర్‌ సంస్థ అమలు చేస్తున్న వివిధ ప్రతిష్ఠాత్మక సామాజిక బాధ్యత కార్యక్రమాలు, వాటి లక్ష్యాలు, అమలు విధానాలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, సామాజిక అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని సమగ్రంగా వివరించారు.


రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం, జస్టిస్‌ ఆన్‌ వీల్స్‌, హరే కృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, జల వనరుల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సదుపాయాల ఏర్పాటు, నిరుద్యోగ యువత కోసం జాబ్‌ మేళాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా తేనెటీగల పెంపకం, ప్రోత్సాహం తదితర కార్యక్రమాలను వివరించారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సింగరేణి అమలు చేస్తున్న ఈ వినూత్న, ప్రజోపయోగ కార్యక్రమాల పట్ల కోల్‌ ఇండియా లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు సింగరేణిని అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 03:46 AM