కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు పదో తరగతి దాకా ఉచిత విద్య
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:58 AM
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల పిల్లలకు సంస్థ పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉచితంగా విద్య అందించనున్నారు.
సింగరేణి పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు
ఔట్‌సోర్సింగ్ కార్మికుల పిల్లలకూ అవకాశం
ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల పిల్లలకు సంస్థ పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉచితంగా విద్య అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇటీవల కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ ఈ మేరకు అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
సొసైటీ ఆధ్వర్యంలోని 9 పాఠశాలల్లో ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికుల పిల్లలు 400 మందికి పైగా చదువుతున్నారు. వీరికి ఉచిత విద్య తక్షణమే వర్తిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే పిల్లలకూ దీనిని విస్తరిస్తారు. దీంతో సింగరేణి విద్యాసంస్థల్లో వీరి ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సదుపాయం కోసం కార్మికులు కొన్ని పత్రాలను సంబంధిత సింగరేణి శాఖాధిపతుల ద్వారా ధ్రువీకరించి సమర్పించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను అందించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News