ప్రైవేటు భూమిపై ముదిరాజ్ నేతల కన్ను
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:23 AM
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుబ్బడిలో ప్రైవేటు భూమిని కుల సంఘానికి ఇవ్వాలని కొందరు ముదిరాజ్ నేతలు బెదిరిస్తున్నారని రాజయ్య కుటుంబం ఆరోపించింది. భూమి ఇవ్వలేదని కుల బహిష్కరణ చేసి, తమతో మాట్లాడితే రూ.2,000 జరిమానా విధిస్తామని, ఇల్లు తగలబెడతామని బెదిరిస్తున్నారని బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
కుల సంఘానికి భూమి ఇవ్వాలని బెదిరింపులు
భూమి ఇవ్వనందుకు కుల బహిష్కరణ..ఉల్లంఘిస్తే 2వేల జరిమానా
ఇల్లు తగలబెడతామని హెచ్చరికలు.. సిద్దిపేట జిల్లాలో ఘటన
న్యాయం చేయాలని అధికారులకు బాధిత రాజయ్య కుటుంబం విజ్ఞప్తి
అక్కన్నపేట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అనునిత్యం అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రపంచమే కుగ్రామంగా మారినా.. పల్లెల్లో మాత్రం కులం ఆధిపత్య జాఢ్యం వీడటం లేదు. తాము చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తూ కులం పేరిట ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసినట్లు ప్రకటించి వారి పెద్దలు వేధిస్తూ.. బెదిరిస్తున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుబ్బడిలో వెలుగు చూసింది. గౌరవెల్లి శివారులో ప్రాజెక్టు వద్ద గుబ్బడిలోని ముదిరాజ్‌లకు చెందిన మేడబోయిన రాజయ్య 303 సర్వే నంబర్‌లో గోపు రాంరెడ్డి వద్ద 3.24 ఎకరాలు, కొండెం కిషన్ రెడ్డి దగ్గర 1.08 ఎకరాలు.. మొత్తం 4.32 ఎకరాల భూమిని 2008లో తన కుటుంబ సభ్యుల పేరుతో కొన్నారు.
సదరు భూమిలో మేడబోయిన సారవ్వ పేరుపై 1.31 ఎకరాలు, మేడబోయిన స్వప్న పేరుపై 1.30 ఎకరాలు, మేడబోయిన లక్ష్మి పేరుపై 1.08 ఎకరాలను రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. ప్రాజెక్టు వద్దనున్న ఈ భూమిపై ముదిరాజ్ కుల సంఘం నేతలు అన్నబోయిన ధనంజయ్, యామ శంకర్, సమ్మెట శ్రీనివాస్ కన్ను పడింది. వీరు తమ సొంత కష్టార్జితంతో కొన్న భూమిలో రెండెకరాలు ముదిరాజ్ కుల సంఘానికి ఇవ్వాలని దౌర్జన్యంగా తమ భూమి వద్దకొచ్చి ఆందోళన చేస్తూ.. తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మేడబోయిన రాజయ్య కుటుంబీకులు బోరుమన్నారు. భూమి ఇవ్వనందుకు కుల సంఘం నుంచి తమ కుటుంబాన్ని బహిష్కరించడంతోపాటు కులం వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు గానీ, చనిపోయిన వారి ఇళ్లకు గానీ రానివ్వడం లేదని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ నెల 9న గ్రామంలో చనిపోయిన తమ కులం వ్యక్తి ఇట్టబోయిన రాణి ఇంటికెళితే అక్కడికీ తమ కుటుంబ సభ్యులను రానివ్వలేదన్నారు. తమతో ఎవరు మాట్లాడినా రూ.2,000 జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని రాజయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుల సంఘానికి భూమి ఇవ్వకపోతే పెట్రోల్ పోసి తమ ఇంటిని తగలబెడతామని అన్నబోయిన ధనంజయ్, యామ శంకర్, సమ్మెట శ్రీనివాస్ బెదిరిస్తున్నారని చెప్పారు. చివరకు గ్రామ వాట్సాప్ గ్రూప్ నుంచీ తమ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రాజయ్య కుటుంబ సభ్యులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటు కోసం సిగపట్లు!
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News