ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:11 AM
పొన్నం కుటుంబం ఉమ్మడి కుటుంబ విలువలను కాపాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో జరిగిన ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు-2026’ కార్యక్రమంలో వ్యవసాయం, సాహిత్యం, జానపద కళారంగాల్లో ముగ్గురికి అవార్డులు అందజేశారు.
కుటుంబ విలువలను కొత్త తరానికి అందించాలి
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం
రవీంద్రభారతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆస్తులు తరాలకు అందుతాయని, కానీ విలువలు మాత్రమే తరాలను కలుపుతాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కుటుంబ బంధాలు బలహీనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ, ఆప్యాయతలతో ముగ్గురు అన్నదమ్ములు ఐక్యంగా కొనసాగుతున్న పొన్నం కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతిని పురస్కరించుకుని పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ‘జీవన సాఫల్య పురస్కారాలు-2026’ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో కోదండరెడ్డి, సాహిత్య రంగంలో వెలిచాల కొండల్ రావు, జానపద కళారంగంలో గొట్టె కనకవ్వకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. సత్కార గ్రహీతలకు జ్ఞాపికతో పాటు రూ.50వేలు అందజేశారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ విలువలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టిన తమకు వ్యవసాయం విలువ తెలుసని, తండ్రి చూపిన బాటలోనే సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటు కోసం సిగపట్లు!
రాష్ట్రంలో ఇకపై అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News