రాష్ట్రంలో ఇకపై అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:03 AM
తెలంగాణలో ఇకపై అన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటించారు. ఖమ్మం శంఖారావం సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు జనసేన ప్రత్యామ్నాయమని నేతలు పేర్కొంటూ, సామాజిక తెలంగాణ సాధనకు తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
ఖమ్మం జనసేన శంఖారావంలో రామ్, గడల
ఖమ్మం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సామాజిక తెలంగాణ జనసేనతోనే సాధ్యమని జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆ పార్టీ ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు అన్నారు. ఇకపై తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఖమ్మంలో ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన శంఖారావం సభలో రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అభివృద్ధిలోనూ, హామీల అమలులోనూ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఆ రెండు పార్టీలకు జనసేననే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించేందుకు జన సైనికులు కదలిరావాలని పిలుపునిచ్చిన ఆయన.. ఇకపై శంఖారావం సభలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్‌లో ఓ గిరిజన బిడ్డ హత్యకు గురైతే గిరిజనుల గొంతుకై జనసేన స్పందించిందని, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు పేద వర్గాలకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో అన్నివర్గాల వారు జనసేన వైపే చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటుతుందని గడల శ్రీనివాసరావు అన్నారు. పవన్‌కళ్యాణ్ ఆశయాలు, లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మంలో నిర్మిస్తున్న కేబుల్‌బ్రిడ్జికి పద్మశ్రీ వనజీవి రామయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 22ఏ ద్వారా రాష్ట్రంలోని భూములను కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని జనసేన రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్‌గౌడ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన 22ఏను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం సిగ్గుచేటన్నారు. సెప్టెంబరు 17 వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వాహించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటు కోసం సిగపట్లు!
పాత పెన్షన్ పునరుద్ధరిస్తేనే అధికారం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News