Share News

మెట్రో-ఆర్టీసీ ప్రయాణానికి కామన్ పాస్.. భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరణ

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:25 PM

హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో సేవలకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.

మెట్రో-ఆర్టీసీ ప్రయాణానికి కామన్ పాస్.. భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఆవిష్కరణ
RTC Metro Common Pass

హైదరాబాద్, అక్టోబర్ 2: భాగ్యనగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు కామన్‌ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు(శుక్రవారం) ప్రజాభవన్‌లో మెట్రో - ఆర్టీసీ కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, వివేక్, అజారుద్దీన్ పాల్గొన్నారు. సీఎంతో కలిపి 15 మంది మంత్రులకు డబ్బులు ఇచ్చి మరీ వన్ డే ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం కొనుగోలు చేశారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ద్వారా మెట్రోలో భట్టి విక్రమార్క, మంత్రులు ప్రయాణం చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచలోనే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. భాగ్యనగరం దేశానికి దశదిశలా మారేలా చేస్తున్నామని చెప్పారు.


మోస్ట్ లివబుల్‌సిటీగా హైదరాబాద్..

హైదరాబాద్ మహా నగరంలో ప్రస్తుతం రూ.52,000 కోట్ల పనులు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఫేజ్ -2 లో రూ.38,000 కోట్ల మెట్రో పనులు చేపడుతున్నామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ 366 కి.మి లతో... రూ.30, 627 అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. 21 రేడియల్ రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. మూసి పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. 30వేల ఎకరాల్లో భారత్ ప్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మోస్ట్ లివబుల్ సిటీగా హైదారాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. హైదారాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే తిప్పాలని చూస్తున్నామని, ఆటోలకు రెట్రో ఫిట్‌మెంట్‌ను తీసుకొచ్చామని చెప్పారు. హిల్ట్ పాలసీని తీసుకొస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.


ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి పొన్నం

ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీపై పెరిగిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అయితే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గుతాయన్నారు. ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సమన్వయం చేసి ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఫస్ట్ మైల్ - లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటో రంగాన్ని కూడా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.


ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం

ఆటో డ్రైవర్లు కూడా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక భాగస్వాములని పొన్నం పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు, జీవనోపాధి, సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందన్నారు. దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలన చేస్తోందని తెలిపారు. ప్రజలపై అదనపు భారం పడకుండా, ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు.


ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యం

విజన్ - 2047లో ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యమని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భవిష్యత్తుతరాలకు అనుగుణంగా సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో తదితర రవాణా వ్యవస్థలను టెక్నాలజీతో అనుసంధానం చేస్తామన్నారు. ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని రవాణా సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా.. రవాణా రంగ కార్మికులకు మెరుగైన సంక్షేమం ఇదే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్.. సెంట్రల్ కిచెన్లపై సీఎం రేవంత్ ఆదేశాలివే

కొడంగల్‌లో బీఆర్ఎస్ సభ.. రేవంత్‌కు చెమటలు పట్టిస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:28 PM