Share News

రైస్‌ మిల్లర్‌ రౌడీయిజం!

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:22 AM

రాష్ట్రంలో కొందరు రైస్‌మిల్లర్ల అరాచకాలు హద్దు మీరుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్న రైస్‌మిల్లర్లు... అధికారులపై దాడులు చేయటానికీ వెనకాడటం లేదు.

రైస్‌ మిల్లర్‌ రౌడీయిజం!
Rice Mill

  • పౌరసరఫరాల శాఖ డీసీ కొండల్‌రావుపై దాడి..

  • గతంలో వనపర్తి జిల్లా మేనేజర్‌ జగన్మోహన్‌పై కూడా..

  • కారులో డబ్బులు పెట్టించి..

  • ఏసీబీకి పట్టించిన వైనం

  • ఉమ్మడి పాలమూరులో శివప్రసాద్‌రెడ్డి అరాచకాలు

  • 5 రైస్‌ మిల్లుల్లో రూ.36.48 కోట్ల ధాన్యం మాయం

  • కేసులు నమోదు కావడంతో థాయ్‌లాండ్‌కు పరారీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొందరు రైస్‌మిల్లర్ల అరాచకాలు హద్దు మీరుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్న రైస్‌మిల్లర్లు... అధికారులపై దాడులు చేయటానికీ వెనకాడటం లేదు. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఒక రైస్‌మిల్లర్‌ రౌడీయిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌పై దాడి చేయించడమే కాకుండా కారులో డబ్బులు పెట్టి ఆయన్ను ఏసీబీకి పట్టించడం, ఇటీవల పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్‌ కొండల్‌రావుపై తన మనుషులతో దాడి చేయించడం.. హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనలకు సంబంధించి వనపర్తి జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్‌ బి.శివప్రసాద్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.


అసలేం జరిగిందంటే?

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఉన్న చాముండేశ్వరి రైస్‌మిల్లులో రూ.13కోట్ల విలువైన ధాన్యం, అదే మండలంలోని మోజెర్లలో ఉన్న మిల్లులో రూ.9 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు మిల్లులకు బి.శివప్రసాద్‌రెడ్డే యజమానిగా ఉన్నారు. అలాగే, కొత్తకోట మండలం మిరా్‌సపల్లిలో ఉన్న సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్‌ సైతం ప్రభుత్వానికి రూ.4కోట్ల మేర బకాయి ఉంది. ఈ మిల్లు.. రమావత్‌ సమన్‌ నాయక్‌ పేరుపై ఉండగా, అతడు శివప్రసాద్‌రెడ్డికి బినామీ అనే ఆరోపణలున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని శ్రీరామా ట్రేడర్స్‌ రూ.4.48 కోట్లు, మదనగోపాల ఇండస్ట్రీస్‌ రూ.6 కోట్ల విలువైన ధాన్యాన్ని అమ్ముకున్నట్లు తేలింది. శివప్రసాద్‌రెడ్డి, అతడి అనుచరులకు చెందిన ఈ ఐదు మిల్లులు రూ.36.48 కోట్ల మేర ప్రభుత్వానికి బకాయి పడ్డాయి. ఈ మేరకు శివప్రసాద్‌రెడ్డితోపాటు సమన్‌ నాయక్‌, గురువ గురునాథ్‌పై క్రిమినల్‌, రెవెన్యూ రికవరీ యాక్టు కేసులు నమోదయ్యాయి. కొద్దినెలల క్రితం పౌరసరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న జగన్మోహన్‌పై సదరు రైస్‌మిల్లర్‌ దాడికి పాల్పడాడు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనే దాడి జరగ్గా... అట్రాసిటీ కేసు నమోదు చేసి రైస్‌మిల్లర్‌ను జైలుకు పంపారు. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. జగన్మోహన్‌ కారులో డబ్బులు పెట్టించి ఏసీబీకి పట్టించాడు. ధాన్యం బస్తాలు మాయం చేసిన ఉదంతంపై నివేదిక ఇచ్చినందుకే.. కక్ష గట్టి ఏసీబీకి పట్టించారని ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రైస్‌ మిల్లుకు కోడ్‌ నంబరు ఇవ్వాలని, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకపోయినప్పటికీ అనుమతులు ఇవ్వాలని పౌర సరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్‌ కొండల్‌రావుపై శివప్రసాద్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. సదరు అధికారి అంగీకరించకపోవటంతో కార్యాలయంలోనే వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత హైదరాబాద్‌ మెట్ట్టుగూడ సమీపంలో కొండల్‌రావుపై కొందరు దుండగులు దాడి చేశారు. పోలీసుల విచారణలో దాడి చేసిన దుండగులు రైస్‌మిల్లర్‌ శివప్రసాద్‌రెడ్డి వ్యక్తులేనని తేలింది. ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్న పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర... దాడులకు పాల్పడిన రైస్‌మిల్లర్లపై ఉక్కుపాదం మోపారు. దాడి చేసిన, చేయించిన వారిపై కేసులు నమోదు చేయించారు. డీసీ కొండల్‌రావు భద్రత కోసం గన్‌మెన్‌ను ఏర్పాటు చేశారు.


థాయ్‌లాండ్‌కు పారిపోయిన రైస్‌మిల్లర్‌

అధికారులపై దాడులకు పాల్పడిన రైస్‌మిల్లర్‌ శివప్రసాద్‌రెడ్డి విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. ఇప్పటికే క్రిమినల్‌ కేసులు నమోదు కావటం, పీడీ యాక్టు నమోదు చేయడానికి రంగం సిద్ధం కావడంతో... పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు థాయిలాండ్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుండడంతో రైస్‌మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు

శీతల్‌కు టాప్‌ సీడ్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 07:26 AM