Share News

మిస్టర్‌ డీజీపీ.. మీ కోడళ్లను అంటే ఇలానే వదిలేస్తారా?

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:41 AM

‘మిస్టర్‌ డీజీపీ.. పరీక్ష పాసయ్యి డీజీపీ అయ్యారా ? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చావా ?’’అంటూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌పై తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మిస్టర్‌ డీజీపీ.. మీ కోడళ్లను అంటే ఇలానే వదిలేస్తారా?
Kalvakuntla Kavitha

  • పరీక్ష పాసయ్యారా.. రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చారా ?

  • డీజీపీ సీవీ ఆనంద్‌పై కవిత ధ్వజం

  • తనని కించపరిచేలా కామెంట్‌ చేసిన కానిస్టేబుల్‌ అరెస్టుకు డిమాండ్

హైదరాబాద్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ‘‘మిస్టర్‌ డీజీపీ.. పరీక్ష పాసయ్యి డీజీపీ అయ్యారా ? రికమండేషన్‌తో జాబ్‌లోకి వచ్చావా ?’’అంటూ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌పై తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం తగదని అన్నారు. ఇకపై ఎవరూ మహిళలను కించపరిచే పోస్టులు పెట్టకుండా ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అంతర్జాతీయ వేదికల్లో ప్రభుత్వం పరువు తీస్తానని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారత న్యాయ సంహిత సెక్షన్‌ 356, సెక్షన్‌ 79, ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయో డీజీపీ చదువుకోవాలని సూచించారు. 20 ఏళ్ల ప్రజాజీవితంలో ఎంపీ, ఎమ్మెల్సీగా, ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తనకే రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు ఏం రక్షణ ఇస్తారని ప్రశ్నించారు. ‘‘ మీకూ ఇద్దరు కోడళ్లు ఉన్నారు. వారిని కూడా ఇలాగే ఎవరైనా కామెంట్‌ చేస్తే వదిలేస్తారా ? ’’ అంటూ డీజీపీని ప్రశ్నించారు. అలాగే, సీవీ ఆనంద్‌ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్‌ రేటు పెరిగిందని, రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా పెరిగిందని ఖమ్మంలో డీజీపీనే వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కవిత అన్నారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలు

ఎన్నికల ముందు ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పనిచేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే వారిని మోసగించారని కవిత ఈ సందర్భంగా ఆరోపించారు ఎన్నో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు తమకు ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఉద్యమాలు చేయాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కోదండరాం ఉద్యమకారులకు మేలు చేయాలని కోరారు. ఇక, మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్‌ చేస్తున్న డిమాండ్‌పై పరోక్షంగా స్పందించిన కవిత... నాయకులు ఎక్కడుంటే తమకు ఎందుకని, ప్రజాసమస్యలను తీర్చాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్పందించకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతు భరోసా, శాంతిభద్రతలు సహా అసెంబ్లీలో చర్చించేందుకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ.. ‘‘నువ్వెక్కడున్నావ్‌.. నేనెక్కడ ఉన్నా’’ అంటూ అధికార, ప్రతిపక్షాలు అటెన్షన్‌ డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నాయని కవిత విమర్శించారు,


నర్సు కేసులో అన్నీ లొసుగులే : కవిత

కొత్తగూడెం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌లో జరిగిన నర్సు హత్య, లైంగిక దాడి ఘటనకు సంబంధించిన కేసులో అన్నీ లొసుగులే ఉన్నాయని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన బాధిత కుటుంబాన్ని కవిత ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇంటిని చూసుకుంటా అని హైదరాబాద్‌ వచ్చిన కోయబిడ్డ విషయంలో జరిగిన ఘటన పట్ల ప్రభుత్వం మానవత్వంతో విచారణ జరపాల్సి ఉందన్నారు. కానీ సంఘటన జరిగినప్పటి నుంచి అన్నీ రహస్యంగానే చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు రిపోర్ట్‌లో కానీ, ఎఫ్‌ఐఆర్‌లో కానీ ఆస్పత్రి పేరు లేదని, తల్లిదండ్రులు వెళ్తే సంబంధిత నర్సు ఎవరో తెలియదని ఆస్పత్రి వారు చెప్పారని కవిత అన్నారు. ఆస్పత్రి క్వార్టర్స్‌లోనే ఈ ఉదంతం జరిగిందని, సదరు ఆస్పత్రిని సీజ్‌ చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రపంచం మెచ్చేలా.. గోదావరి పుష్కరాలు

శీతల్‌కు టాప్‌ సీడ్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 06:41 AM