ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:14 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూముల రీ-సర్వే’ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూముల రీ-సర్వే’ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దళితుల భూములలో అంగుళం భూమిని కూడా ప్రభుత్వం లాక్కోదని.. రెచ్చగొట్టే విష ప్రచారాలను నమ్మొద్దని మంత్రి కోరారు. ప్రజల భూమిని తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను మంత్రి వెల్లడించారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో డిజటల్ సర్వే చేయించి.. భూ విస్తీర్ణాన్ని కచ్చితంగా నమోదు చేయడం, తద్వారా భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడం, భూ ఆక్రమణలపై విచారణ చేయించడం, తద్వారా ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడం, ధరణిలో లోపాలను సవరించడానికి, నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ భూముల వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, ప్రతి భూమికీ ఒక ఐడీ నెంబరును కేటాయించడం, దళిత గిరిజన భూములను సర్వే చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించడం, తద్వారా భూమిపై హక్కులను కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
ఇప్పటికే నారాయణపురం, నూతనకల్, మద్దిరాలలోని 15 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించి దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు పరిష్కారం చూపించామని పొంగులేటి తెలిపారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విష ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూముల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్
రోడ్ల విస్తరణకు ఇరిగేషన్ అధికారులు ఎందుకు అడ్డం పడుతున్నారు: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్‌లో పోలీసుల భారీ ఆపరేషన్.. 425 కేజీల గంజాయి స్వాధీనం
Read Latest Telangana News And AP News And National News