Share News

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - May 21 , 2026 | 12:46 PM

దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, మే 21: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో సాంకేతికతను తీసుకొచ్చిన గొప్ప దార్శనీకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడన్నారు. సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన గొప్ప దార్శనీకుడు రాజీవ్ గాంధీ అని చెప్పుకొచ్చారు.


సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమైందని సీఎం అన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. అది కుటుంబ సంబంధం కంటే ఎక్కువని తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు ప్రజలు గాంధీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారని అన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‌ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు.


మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు... రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.


ఇవి కూడా చదవండి...

మదీనా చౌరస్తాలోని వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం..

తెలంగాణలో మే 25 నుంచి ‘మహిళా వారోత్సవాలు’

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:56 PM