డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:33 PM
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఉద్దేశ్యం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడమేనని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ అనేది రాజకీయ పార్టీలకో, ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసిన సీఎం రేవంత్, దీనిని మహిళా రిజర్వేషన్లతో కలిపి చూపించడం సరైంది కాదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలను కలిపి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని విమర్శించారు.
దుష్ప్రచారం జరుగుతోంది
మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఓటుహక్కు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళలు ముఖ్యమైన పదవులు చేపట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
రెండూ వేర్వేరు
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, వీటిని కలిపి బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ రెండు అంశాలను అనుసంధానించడం వెనుక రాజకీయ కుట్ర, వివక్ష ఉన్నాయని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉందని ప్రకటించిన సీఎం రేవంత్, ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సీట్ల ఆధారంగానే ఈ బిల్లును అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ బిల్లును అమలు చేసి ఉంటే, మరింత మంది మహిళలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యేవారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Also Read:
ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం
జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి
For More Latest News