Share News

ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:24 PM

బరువు తగ్గడం గురించి ఈ రోజుల్లో చాలా మంది విభిన్నమైన సలహాలను అనుసరిస్తున్నారు. కానీ వాటిలో చాలా వరకు అపోహలే ఉంటాయి. ఇప్పుడు, ప్రజలు నమ్మే సాధారణ అపోహల వెనుక ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం
Weight Loss Myths

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది కేవలం ఆరోగ్య లక్ష్యం మాత్రమే కాదు, ఒక ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, చుట్టుపక్కల వారి సలహాల వల్ల రోజుకో కొత్త డైట్ టిప్స్ వినిపిస్తున్నాయి. కొందరు తినడం మానేయమంటారు, మరికొందరు కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేయమని చెబుతారు. ఇలా నిజం, అపోహ మధ్య తేడా తెలుసుకోవడం చాలా మందికి కష్టమవుతోంది.


త్వరగా బరువు తగ్గాలనే ఆతృతలో, చాలామంది తప్పు సమాచారాన్ని నమ్మి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రతి ఒక్కరి శరీరం వేరు కాబట్టి, ఒకే పద్ధతి అందరికీ పనిచేయదు. అందుకే ఇప్పుడు బరువు తగ్గడం గురించి ఎక్కువగా నమ్మే అపోహలు, వాటి వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం..


భోజనం మానేస్తే బరువు తగ్గుతారనే అపోహ

భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారని అనుకోవడం తప్పు. ఇలా చేయడం వల్ల శరీరంలోని జీవక్రియ నెమ్మదిస్తుంది. దీంతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే అవసరమైన పోషకాలు అందకుండా చేస్తుంది. సమయానికి, సమతుల్యంగా ఆహారం తీసుకోవడం ముఖ్యం.

కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాలనే అపోహ

కార్బోహైడ్రేట్లు శరీరానికి ముఖ్యమైన శక్తి వనరు. వాటిని పూర్తిగా మానేస్తే అలసట, బలహీనత వస్తాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు (మైదా, తెల్ల అన్నం) తగ్గించి, ఓట్స్ వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం చాలా మంచిది.


కేవలం వ్యాయామం చేస్తే చాలు అనే అపోహ

వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు. సరైన ఆహారం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరం. బరువు తగ్గడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కొవ్వు తింటే బరువు పెరుగుతారనే అపోహ

అన్ని కొవ్వులు చెడ్డవి కావు. గింజలు, విత్తనాలు, ఆలివ్ నూనెలో ఉండే మంచి కొవ్వులు శరీరానికి అవసరం. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్, జంక్ ఫుడ్ మాత్రం హానికరం.

వేగంగా బరువు తగ్గితే మంచిదనే అపోహ

వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల బలహీనత, కండరాల నష్టం కలగవచ్చు. క్రమంగా, స్థిరంగా బరువు తగ్గడమే సురక్షితమైన మార్గం. బరువు తగ్గడంలో షార్ట్‌కట్స్ ఉండవు. సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర..ఈ మూడింటిని పాటించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అపోహలను నమ్మకుండా, నిజాలను తెలుసుకుని ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోవడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 13 , 2026 | 05:00 PM