Share News

ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఊహించి ఉండరు: సీఎం

ABN , Publish Date - Jun 19 , 2026 | 06:39 PM

ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఊహించి ఉండరు: సీఎం

హైదరాబాద్, జూన్ 19: ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలోనూ ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో పాటు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.26,600 కోట్లు ఖర్చు చేస్తోంది.


ఇది ఖర్చుగా కాదు.. భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు.. విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే వాటి ఛార్జీలు పెంచాం. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యాశాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది' అని రేవంత్ అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'అందుకే విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని ఆ శాఖను నా వద్దే పెట్టుకున్నా. ప్రీప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలోనూ ఊహించి ఉండరు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం.


యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపబోతున్నాం. రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీనీ ఏర్పాటు చేశాం. ఏఐ(AI) తుపాన్‌తో కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం' అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.


విద్యార్థులకు ఇంగ్లీష్‌తో పాటు జర్మనీ, జపాన్ భాషను కూడా నేర్పిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. "ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదునుపెట్టి గొప్పవాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. సోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రాజకీయ నాయకులుగా ఎదగాలి. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి. రేపటి భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి.. మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

దుర్గమ్మ భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు: ఈవో శీనా నాయక్

యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 07:54 PM