యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి
ABN , Publish Date - Jun 19 , 2026 | 02:42 PM
సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి, జూన్19: సంగారెడ్డి జిల్లాకు బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జాగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రైవేటీకరణ చేస్తుందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో జగ్గారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నెహ్రు పాలనని బ్రేక్ చేశామని బీజేపీ నేతలు సంబరాలు చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.
రాహుల్ గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ, ముత్తాత దేశం కోసం ఏం చేశారో తాను వివరిస్తానని తెలిపారు. మరి12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో ఏం చేశారో సమాధానం చెబుతారా? అంటూ బీజేపీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రధాని మోదీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
విద్యాసంస్థల్లో ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు.. సేఫ్ ఎన్విరాన్మెంట్ ముఖ్యం: సీపీ సజ్జనార్
వాన్‌పిక్ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్
Read Latest Telangana News And Telugu News