ఎల్బీనగర్‌లో118 జీఓ సమస్యను పరిష్కరిస్తాం.. అసెంబ్లీ వేదికగా సీఎం హామీ
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:31 PM
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొంతమంది ప్రజలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని.. ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈరోజు(బుధవారం)శాసనసభలో మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని.. ఏళ్ల తరబడి అక్కడే నివసిస్తున్నారని అన్నారు. వీరి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని.. ప్రభుత్వం తరఫున శుభవార్త చెప్పనున్నట్లు తెలిపారు. ఈ నియోజకవర్గంలో118 జీఓ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తామన్నారు. సికింద్రాబాద్ పరిధిలో ఫ్రీహోల్డ్, భూదాన్ భూ సమస్యను పరిష్కరిస్తామని రేవంత్ పేర్కొన్నారు.
హైపవర్ కమిటీ నియామకం..
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని.. 22A సమస్యల్లో 12 అంశాలను గుర్తించామని ముఖ్యమంత్రి తెలిపారు. 12 ప్రధాన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీని నియమిస్తామని ప్రకటించారు. 22Aలో ఏ భూములను చేర్చాలనేదానిపై నిర్దేశిత విధానంతో ముందుకెళ్తామన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ పెట్టి సమస్య పరిష్కారానికి అడుగులు వేశామని చెప్పారు. సీఎం ఇల్లు 22Aలో ఉందని వాళ్లే అంటున్నారని.. అది మంత్రి చేతుల్లో ఉండదని.. టెక్నికల్ సమస్య అని తెలుసుకోవాలన్నారు. 22Aలో ఏదైనా భూమిని చేర్చే అధికారం.. RDO లేదా సబ్‌కలెక్టర్లదే అని పేర్కొన్నారు. భూ సర్వే నంబర్, పట్టాదార్ వివరాలను స్పష్టంగా గుర్తిస్తారని తెలిపారు.
ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం..
ULC భూముల విషయంలో త్వరలోనే నూతన విధానాన్ని తీసుకొస్తామని రేవంత్ తెలిపారు. నిషేధిత జాబితాలో పెట్టేముందు E-KYC సహా ఈ-మెయిల్, పత్రికా ప్రకటన విధానాన్ని అనుసరిస్తామన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు 15 రోజుల సమయం ఇస్తామని.. మొత్తం అనుసరించిన విధానాన్ని రికార్డు చేస్తామని చెప్పారు. దేవాదాయ, వక్ఫ్ భూముల చట్టం ప్రకారం కొనుగోలు చేస్తే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని ప్రకటించారు. అధీకృత లేఅవుట్లలోని భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్లను వారంలో పరిష్కరిస్తామన్నారు. HMDA, DTCP అనుమతులు పొందిన లేఅవుట్ రిజిస్ట్రేషన్లు చేస్తామని అన్నారు. సింగరేణి పరిధిలో అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పట్టాలు ఇస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులకు మేలు జరిగేలా పట్టాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
హోటల్‌లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News