వాళ్లను చరిత్ర క్షమించదు.. ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్ ఫైర్
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:59 PM
కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) శాసనసభలో మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అంశాలు చర్చకు రావొద్దని, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు, కొంతమంది చేసిన క్షుద్ర పూజలు చర్చకు వస్తాయనే.. సభ మొదటి రోజే కుట్ర పూరితంగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఆడబిడ్డ సమానమే అని స్పష్టం చేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
సభాపతిని గౌరవించడం సభ్యుల సంప్రదాయమని సీఎం అన్నారు. సభలో ప్రతి సభ్యుడి హక్కులను కాపాడేది సభాపతి అని తెలిపారు. గత ప్రభుత్వమే సభ నిర్వహణపై కొన్ని నిబంధనలు రూపొందించిందని.. ఆ నిబంధనల మేరకే సభాపతి ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను గేట్-3 వద్ద పోలీసులు అమలు చేశారని వివరించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నల్ల టీషర్టు వేసుకుని వెళ్లారని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని.. నినాదాలతో కూడిన టీషర్టులతో లోపలకి రాకూడదని స్పీకర్ ఆదేశాలిస్తే వారు పాటించేవారని తెలిపారు.
లోక్‌సభ స్పీకర్ పార్లమెంట్‌లో అలాంటి నిబంధనలు విధించలేదని ముఖ్యమంత్రి తెలిపారు. కానీ తెలంగాణ శాసనసభలో ఎలాంటి నిబంధనలు ఉండాలో గత ప్రభుత్వమే రూపొందించిందని చెప్పుకొచ్చారు. పోలీసులను దూషించి, అర్ధనగ్న ప్రదర్శన చేసి, సభాపతిని కూడా దూషించారని మండిపడ్డారు. దీనిపై స్పీకర్‌కు క్షమాపణ చెప్పి సమస్యలపై చర్చ చేస్తారని భావించే ప్రతిపక్ష నేతలను సభలోకి అనుమతించారన్నారు. కానీ విచక్షణ కోల్పోయి వ్యవహరించడం వల్లే బీఆర్‌ఎస్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారని తెలిపారు. వారు సభకు రాలేదని ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యతను విస్మరించలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆ ఇద్దరూ కలిసి మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారు: మంత్రి శ్రీధర్ బాబు
హోటల్‌లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News