Share News

మరో స్వాతంత్య్ర పోరాటం

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:56 AM

దేశానికి స్వాతంత్య్రం కోసం ఒకప్పుడు ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమం జరిగిందని, ఇప్పుడు ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’, ‘ఎస్‌ఐఆర్‌ గో బ్యాక్‌’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

మరో స్వాతంత్య్ర పోరాటం
Revanth Reddy

  • నాడు ‘సైమన్‌ గోబ్యాక్‌’.. నేడు జ్ఞానేశ్‌ గోబ్యాక్‌

  • సర్‌తో ఓటు చోరీకి మోదీ, షా, జ్ఞానేశ్‌ కుట్ర

  • దీనిపై రాష్ట్రపతి, సీజేఐ స్పందించాలి

  • రాజ్యాంగబద్ధ వ్యవస్థలు

  • ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి

  • ఢిల్లీలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో రేవంత్‌

  • బీజేపీ గెలుపు రహస్యం ఎన్నికల్లో

  • అవకతవకలే: పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం కోసం ఒకప్పుడు ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమం జరిగిందని, ఇప్పుడు ప్రజల ఓటు హక్కును కాపాడుకునేందుకు ‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’, ‘ఎస్‌ఐఆర్‌ గో బ్యాక్‌’ నినాదాలతో ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమమని పేర్కొన్నారు. దేశ జనాభా పెరిగితే ఓటర్ల సంఖ్య పెరగాలని, కానీ.. ఓట్లు తొలగించడమేంటని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ను ముందుపెట్టి, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.


రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలు ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఓటు చోరీ వ్యవహారంపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో ఆందోళనలో భాగంగా సోమవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గతంలోనూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ జరిగిందని, అయితే 1950లో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటుహక్కు లేనివారికి ఓటుహక్కు కల్పించారని తెలిపారు. తర్వాత ఇందిరాగాంధీ, వాజపేయి ప్రభుత్వాల కాలంలోనూ ఎస్‌ఐఆర్‌ జరిగిందని, కానీ.. ఆనాడు తాతలు, ముత్తాతలకు ఓటు ఉంటేనే అనే అర్థం పర్థం లేని కారణాలేమీ చూపలేదని పేర్కొన్నారు.


ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకే..

తమ అధికారానికి అడ్డుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, నార్కోటిక్స్‌ విభాగం వంటి సంస్థలను ఉపయోగించుకుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు వాటితో ప్రత్యర్థులను ఎదుర్కోవడం కష్టమవుతోందనే ఉద్దేశంతో ఎస్‌ఐఆర్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అని, దానిని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత దెబ్బతింటే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.


గతంలో ఎన్నికల సంఘం ఒక్క కమిషనర్‌ నేతృత్వంలో పనిచేసేదని, అయితే ఈ సంస్థలో మరింత పారదర్శకత తీసుకువచ్చేందుకు నాటి ప్రధాని పీవీ నర్సింహారావు ముగ్గురు కమిషనర్ల విధానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. గతంలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ప్రతిపక్ష నేత భాగస్వామ్యంతో నియామక ప్రక్రియ సాగేదని, అయితే మోదీ ప్రభుత్వం 2023లో ఈ విధానాన్ని మార్చిందని తెలిపారు. సీజేఐ స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చారని, నిర్ణయాలను తమకు అనుకూలంగా తీసుకునేందుకే ఈ మార్పులు చేశారని మండిపడ్డారు. జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీగా నియమించే సమయంలోనే రాహుల్‌గాంధీ తీవ్ర అభ్యంతరం తెలిపారని గుర్తు చేశారు.


దళితుల ఓట్లను తొలగించే కుట్ర

దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజల ఓటు హక్కును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశ యువత ఓట్లను తొలగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. సోషల్‌ మీడియాలో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారిని లక్ష్యంగా చేసుకుని వారి ఓటుహక్కును తొలగించే యోచనలో ఉందన్నారు. ఈ ప్రమాదాన్ని తొలుత గుర్తించి దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చింది రాహుల్‌ గాంధీయేనని వెల్లడించారు. ప్రతిపక్షాలే కాకుండా అధికార పక్షంలో ఉన్నవారు కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి వంటివారు దీనిపై గొంతెత్తడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.


జ్ఞానేశ్‌కుమార్‌ నియామకంలో ఎలాంటి కుట్ర లేదని మోదీ, అమిత్‌ షా భావిస్తే.. ఆయనను తొలగించాలనే డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనలు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. బీజేపీకి కొంతమేర బలం ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ విజయాలకు ఓటర్ల జాబితాలో జరుగుతున్న మార్పులు కూడా కారణమనే అనుమానాలు ఉన్నాయన్నారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన సమయంలో దేశంలో సుమారు 81 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రేవంత్‌ తెలిపారు. 2019లో ఈ సంఖ్య సుమారు 91 కోట్లకు, 2024 ఎన్నికల నాటికి సుమారు 97 కోట్లకు చేరిందని వివరించారు. 2026లో ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగించే ఓట్ల సంఖ్యను 20 కోట్లకు పెంచే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరిగితే ఓటర్ల సంఖ్య పెరగాలా? తగ్గాలా? అన్నది సాధారణ ప్రశ్నేనని, దీనికి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


రెండు వర్గాలను సృష్టించే యత్నం..

దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కు లేనివారనే రెండు వర్గాలను సృష్టించే పరిస్థితి ఏర్పడుతోందని సీఎం రేవంత్‌ అన్నారు. సంపన్నులు బీజేపీకి మద్దతుగా ఉంటారని, పేదలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే రాజకీయ లెక్కలతో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఓటు హక్కును తొలగించడం ద్వారా కొన్ని వర్గాల ప్రజలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో సాగుతున్న ‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’ ఉద్యమం దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, ఓటు హక్కును కాపాడేందుకు దోహదపడుతుందని అన్నారు.


ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. బీజేపీ మాత్రమే గెలిచేలా ఎస్‌ఐఆర్‌ పేరుతో జ్ఞానేశ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, దేశంలో ఎన్నికల ప్రక్రియలో ఏదో జరిగిందనే ఆలోచన ప్రజల్లో మొదలైందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అన్నారు. బీజేపీ గెలుపు రహస్యం ఎన్నికల్లో అవకతవకలేనని అందరికీ అర్థమైపోయిందన్నారు. నియంత దేశాల్లోనూ ఇంతటి దుర్భర పరిస్థితి లేదన్నారు. సుప్రీంకోర్టు తమ వాదనలు వినాలని, ఎస్‌ఐఆర్‌ పేరుతో జరిగిన అక్రమాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగా ఉందనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో 75 లక్షల ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. సీఈసీ లేకపోతే మోదీకి 140 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం పునరుద్ధరణకు డిజైన్లు అందజేత

పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు

కోతకు ముందే కొనుగోలు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 05:55 AM