Share News

పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:41 AM

సరిపడా వానల్లేక ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట చేతికి రావడమే కష్టంగా మారింది. మరి.. యాసంగి పరిస్థితి ఏమిటి? సర్కారు ఈ దిశగానే ఆలోచించి రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసేలా రైతులను ప్రోత్సహించే దిశగా కసరత్తు చేస్తోంది.

పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు
Alternative Crops Telangana

  • యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు

  • నీరు తక్కువ అవసరమయ్యే పంటలే సాగు చేయండి

  • వరికి విరామం ఇవ్వాలని రైతులకు సర్కారు విజ్ఞప్తులు

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సరిపడా వానల్లేక ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట చేతికి రావడమే కష్టంగా మారింది. మరి.. యాసంగి పరిస్థితి ఏమిటి? సర్కారు ఈ దిశగానే ఆలోచించి రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసేలా రైతులను ప్రోత్సహించే దిశగా కసరత్తు చేస్తోంది. నీరు తక్కువగా అవసరపడే పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల ప్రణాళిక ప్రకారం సాగు జరగలేదని, యాసంగిలో మాత్రం అలా జరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. యాసంగిలో ఏ పంటలను సాగుచేయాలనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నిర్ణయిస్తారని, దాని ప్రకారమే రైతులు నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.


ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించగా, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యామ్నాయ ప్రణాళికపైనే దృష్టి కేంద్రీకరించారు. నిరుడు యాసంగిలో రైతులు వరి పంటను 65.42 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. సాధారణ విస్తీర్ణం 51.49 లక్షల ఎకరాలుగా ఉంటే... 27 శాతం అధికంగా వరి సాగైంది. వచ్చే యాసంగిలో ఇంత భారీ ఎత్తున వరి సాగుచేసేందుకు నీటి వనరుల్లేవు. ఈ ఖరీ్‌ఫలో వద్దు వద్దంటున్నా రైతులు 56.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఈ సీజన్‌లో 17 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. 235 మండలాల్లో కరువు ఛాయలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో యాసంగిలో పంట విరామం తీసుకుంటేనే మేలనే నిర్ధారణకొచ్చింది.


రాష్ట్రంలో పప్పుధాన్యాలను చాలా తక్కువగా సాగు చేస్తున్నారు. వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 6.50 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఖరీ్‌ఫలో మాత్రం 7.98 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో కంది విస్తీర్ణమే 5.58 లక్షల ఎకరాలు. మినుములు, పెసర్లు కలిపి 2.40 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ మూడు పంటలు తప్ప రైతులు ఇతర పప్పుధాన్యాలు సాగుచేయలేదు. యాసంగి సాధారణ విస్తీర్ణానికి వచ్చేసరికి 4 లక్షల ఎకరాలు ఉంది. నిరుడు 2.82 లక్షల ఎకరాల్లోనే పప్పుధాన్యాలు సాగయ్యాయి. ఇప్పుడు ఇంత తక్కువ విస్తీర్ణంతో సర్దుకునే పరిస్థితిలేదు. యాసంగిలో శనగ, పెసర, మినుములు సాగుచేయటానికి నేలలు అనుకూలిస్తాయి. ఈ క్రమంలో సాధ్యమైనంత ఎక్కువ పప్పుధాన్యాల సాగువిస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం యాసంగి ప్రణాళికలో పెట్టుకుంది. వరి సాగు చేసే నేలల్లో పెసర, మినుములు సాగుచేయటానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఈక్రమంలో 4 లక్షల ఎకరాలున్న పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని... రెండింతలు(8 లక్షల ఎకరాలకు) పెంచాలని, రైతులు కాస్త ముందుకొస్తే మూడింతలు(12 లక్షల ఎకరాలకు) పెంచాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ అంశంపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఖరీ్‌ఫలో నూనెగింజల సాగు సాధారణ విస్తీర్ణం 4.48 లక్షల ఎకరాలుగా ఉంది. యాసంగిలో 3.53 లక్షల ఎకరాలు మాత్రమే!. వరి నేలల్లో పొద్దుతిరుగుడు పువ్వు సాగుచేసుకోవచ్చు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాధారణ విస్తీర్ణం 25 వేల ఎకరాలు కూడా లేదు. నువ్వుల సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలుగా, వేరుశనగ విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలుగా ఉంది.


గత యాసంగిలో 2 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగ సాగుచేశారు. రాష్ట్రంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వు సాగు విస్తీర్ణం ఎంత వీలైతే అంత పెంచుకోవటానికి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో నూనె గింజల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం కూడా రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం మరింత పెంచాలనే దీర్ఘకాలిక లక్ష్యంతోపాటు... వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల విస్తీర్ణం రెండు, మూడు రెట్లు పెంచినా బాగుంటుందనే ఆలోచనతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులను సమాయత్తం చేస్తోంది.


కూరగాయల సాగు అనివార్యం

రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం చాలా తక్కువగా ఉండటమే కాదు.. ఏటికేడు తగ్గుతూ వస్తోంది. టమాటా, ఉల్లిగడ్డ, వంకాయ, బెండకాయ ఇతర కూరగాయల విస్తీర్ణం 2020లో 97,329 ఎకరాలు ఉంటే... 2021లో 74,962 ఎకరాలు, 2022లో 63,127 ఎకరాలు, 2023లో 55,458 ఎకరాలు, 2024లో 44,548 ఎకరాలు, 2025లో 53,405 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగుచేశారు. ఈసారి మాత్రం మళ్లీ 77,788 ఎకరాలకు పెరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపోకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని మరో 4 లక్షల ఎకరాలు పెంచి... 5 లక్షల ఎకరాలకు తీసుకెళితే స్వయం సమృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. ఏడాదిలో రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు తీరాలంటే... 50 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం సుమారు 10 లక్షల టన్నుల వరకు కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం పునరుద్ధరణకు డిజైన్లు అందజేత

141 మందికి అపోలో వైద్య పట్టాల ప్రదానం

ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 04:41 AM