కోతకు ముందే కొనుగోలు!
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:47 AM
ఇప్పటిదాకా ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనమన్నా కొనేవారు కాదు. కానీ, ఇప్పుడు మద్దతు ధరకు రెట్టింపు పెట్టి కొంటామంటున్నారు. అంతేకాదు.. పంట కోసేదాకా కూడా ఆగకుండా కంకి దశలోనే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వరి పొలాల వద్దకు వ్యాపారులు..
కంకి దశలోనే పోటాపోటీగా ధరలు
‘మద్దతు’ కన్నా రెండింతలుగా..
క్వింటా 4600 వరకు ఇచ్చేందుకు రెడీ
రైతులతో ముందస్తు ఒప్పందాలు..
రంగంలోకి మహారాష్ట్ర వ్యాపారులూ..
హైదరాబాద్ శివారు గ్రామాలకూ రాక..
తేమ, తాలు, తరుగు ఉండవు
హైదరాబాద్ సిటీ/నార్సింగ్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇప్పటిదాకా ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనమన్నా కొనేవారు కాదు. కానీ, ఇప్పుడు మద్దతు ధరకు రెట్టింపు పెట్టి కొంటామంటున్నారు. అంతేకాదు.. పంట కోసేదాకా కూడా ఆగకుండా కంకి దశలోనే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని వ్యాపారులు, రైస్ మిల్లర్లే కాకుండా మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా వడ్లు కొనేందుకు తెలంగాణ పల్లెల్లో తిరుగుతున్నారు. రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం దాన్యం విషయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఇప్పటికే బియ్యం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. రకాన్ని బట్టి క్వింటాలు రూ.6 వేల నుంచి రూ.8500 దాకా పలుకుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరగవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
దీనిని ముందే పసిగట్టిన వ్యాపారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లోకి వెళ్లి క్వింటాలు వడ్లకు రూ.4000 నుంచి రూ.4600 ఇస్తామని ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.2441 నుంచి రూ.2461తో (ఏ గ్రేడ్) పోలిస్తే ఇది దాదాపు 80 నుంచి 90 శాతం అదనం కావడం గమనార్హం. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోన్‌సతో పోల్చినా.. సుమారు రూ.1700 అదనం. పైగా.. తరుగుతోనూ సంబంధం లేదని అదనపు ఆఫర్ ఇస్తున్నారు. దీంతో రైతులూ వ్యాపారులతో ముందస్తు అగ్రిమెంట్‌కు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలకూ వ్యాపారుల రాక మొదలైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం, చిన్నమంగళారం, చందానగర్, శంకర్‌పల్లి మండలం, పొద్దుటూరు తదితర గ్రామాలకు కొద్దిరోజులుగా మహారాష్ట్ర వ్యాపారులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. వడ్ల రకాన్ని బట్టి ధర నిర్ణయిస్తూ రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. చిన్నమంగళారంలో రాకేశ్ అనే రైతు తన రెండెకరాల పొలంలో వరి వేశాడు. క్వింటాలుకు రూ.4200 చొప్పున ధరకు విక్రయించేలా మహారాష్ట్ర వ్యాపారులతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాగా, కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు పొద్దుటూరు, చిన్నమంగళారం తదితర ప్రాంతాల్లో 60 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని వరి పండిస్తున్నాడు. ఈ 60 ఎకరాల పంటను మహారాష్ట్ర వ్యాపారులకు అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఆ వ్యాపారులు ఆయనకు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారు.
గతంలో మద్దతు ధర కంటే తక్కువకు..
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు యాసంగిలో నీటి ఆధారిత పంటలు వేయవద్దని ప్రభుత్వం కూడా చెబుతోంది. దీంతో వరి విస్తీర్ణం భారీగా తగ్గనుంది. అదే జరిగితే బియ్యం ధరలు భారీగా పెరగడం ఖాయం. అందుకే గతంలో మద్దతు ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకురాని వ్యాపారులు, రైస్‌మిల్లర్లు ఇప్పుడు పొలాల వద్దకే వచ్చి కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి గ్రామాల వారీగా ఏర్పాటుచేసే ఐకేపీ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర రూ.2461కి వడ్లు కొనేవారు. అది కూడా తేమ శాతం.. ప్రమాణాల ప్రకారం (16 కంటే తక్కువ) ఉంటేనే. ఇందులోనూ బస్తాకు కిలో నుంచి రెండు కిలోలు తరుగు తీసేవారు.
దీంతో రైతులు రోజుల తరబడి వడ్లను ఆరబెట్టాల్సి వచ్చేది. ఆ సమయంలో వర్షం పడితే ఇక ఆగమే. కాగా, బయట వ్యాపారులు, మిల్లర్లు తక్కువ ధర పెడుతున్న కారణంగా అత్యవసరం ఉన్నవారు తప్ప ఎక్కువ మంది రైతులు రోజుల తరబడి వేచిచూసైనా ఐకేపీ కేంద్రాల్లోనే వడ్లు విక్రయించే వారు. వ్యవసాయ మార్కెట్‌కు వెళితే దొడ్డు రకం వడ్లు క్వింటాల్‌కు రూ.1600 నుంచి రూ.1800, సన్న రకం రూ.2000 వరకు ధర పలికేవి. తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర మరింత తగ్గేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వరి కోయక ముందే.. ఐకేపీ కేంద్రాలకు వడ్లు తరలించకుండా పొలాల వద్దకే వ్యాపారులు, మిల్లర్లు వస్తున్నారు. పోటీ పడి మరీ ఽధర నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలో ఇతర వ్యాపారులు వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తామంటే రైతులు మనసు మార్చుకోకుండా పక్కాగా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. తేమ ఎంత ఉందన్నదీ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో తూకమూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండి.. రైతుల ఆదాయమూ పెరగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కాళేశ్వరం పునరుద్ధరణకు డిజైన్లు అందజేత
పప్పులు.. నూనెగింజలు.. కూరగాయలు
ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను ఖండిస్తున్నాం: మంత్రి పొన్నం
Read Latest AP News And Telangana News And International