Share News

ఎన్నికలప్పుడే రాజకీయం

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:54 AM

దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందులో ఎలాంటి రాజీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.

ఎన్నికలప్పుడే రాజకీయం
Indian Roads Congress Conference 2026

  • తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యం

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషిచేయాలి

  • ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందులో ఎలాంటి రాజీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసినా, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా.. మిగిలిన సమయంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు.


గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్సీ) సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నినాదమైన వికసిత్‌ భారత్‌లో తెలంగాణ భాగస్వామ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణ రైజింగ్‌- 2047 విజన్‌ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ‘వికసిత్‌ భారత్‌’ నినాదంతో 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైజింగ్‌- 2047 తోడుగా ఉంటుందని, మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సమకూరుస్తుందని అన్నారు. దేశ జనాభాలో 2.5 శాతం, జీడీపీలో 5 శాతం వాటా తో తెలంగాణ ఉందని, 2047 నాటికి 10 శాతం వాటా సమకూరుస్తామని చెప్పారు.


మూడు జోన్లుగా విభజించి రాష్ట్ర అభివృద్ధి..

తెలంగాణ రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పేరిట మూడు జోన్లుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని సీఎం రేవంత్‌ తెలిపారు. అయితే రోడ్లు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందబోదని, విశాలమైన, నాణ్యమైన రహదారులు దేశ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి బాటలు వేస్తాయని అన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం ఆర్‌అండ్‌బీ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర, జాతీయ రోడ్ల అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారించామని తెలిపారు.


ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌), వరంగల్‌, నిమ్స్‌ లాంటి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ద్వారా రాబోయే రోజుల్లో 8వేల పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశ అభివృద్ధిలో ఐఆర్‌సీ సదస్సు క్రియాశీల పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో భారీగా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేసే లక్ష్యంతో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌- 2026’ను నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, ఐఆర్‌సీ సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలని కోరారు.


‘గడ్కరీ జీ.. కోమటిరెడ్డి మీ వీరాభిమాని’

ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మా రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చాలా పెద్ద జాబితాను మీకు ఇచ్చారు. ఆ పనులన్నీ మీరు మా రాష్ట్రానికి చేయాల్సిందే! ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీ శ్రేయోభిలాషి, మీ అనుచరుడు, మీకు అభిమాని. అన్ని విషయాలు ఆయన చూసుకుంటారు. ఆ విషయంలో నేను పెద్దగా ఆలోంచాల్సింది ఏమీలేదు. కోమటిరెడ్డి అడిగినవన్నీ ఇచ్చేయండి!’’ అని గడ్కరీతో రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో గడ్కరీ బిగ్గరగా నవ్వుతూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భుజంపై చరచడంతో సభలో నవ్వులు పూశాయి. అంతకుముందు మాట్లాడిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గడ్కరీతో మంచి పరిచయాలు ఉన్నాయని, ఆ సంబంధాలతో తెలంగాణకు తప్పకుండా భారీగా నిధులు వస్తాయని అన్నారు.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం

Read latest Telangana News And Telugu NEws

Updated Date - Nov 20 , 2026 | 03:59 AM